Pa Ranjith: కారుతో స్టంట్ చేస్తుండగా రాజు మృతి.. స్పందించిన దర్శకుడు పా. రంజిత్

Pa Ranjith Reacts to Stuntman Rajus Death on Vettuvam Set
  • నాగపట్నం సమీపంలో స్టంట్ చేస్తుండగా స్టంట్ మ్యాన్ రాజు మృతి
  • ప్రతిభావంతుడైన స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయామన్న పా రంజిత్, నిర్మాణ సంస్థ
  • ఇది తమను షాక్‌కు గురి చేసిందన్న పా. రంజిత్
'వేట్టువం' సినిమా చిత్రీకరణ సమయంలో స్టంట్ మ్యాన్ రాజు (52) మృతి చెందడంపై దర్శకుడు పా. రంజిత్ స్పందించారు. ఆర్య కథానాయకుడిగా పా. రంజిత్ దర్శకత్వంలో 'వేట్టువం' చిత్రం రూపొందుతోంది. నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్ చేస్తుండగా రాజు గుండెపోటుకు గురయ్యారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. స్టంట్ మ్యాన్ మృతి పట్ల పా. రంజిత్, ఆయన నిర్మాణ సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టింది.

జులై 13న ఎంతో ప్రతిభావంతుడైన స్టంట్ ఆర్టిస్ట్ మోహన్ రాజును కోల్పోయామని, ఆయన మాతో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారని పేర్కొంది. ఆయన మరణవార్త తెలిసి మా హృదయం బద్దలైందని పేర్కొంది. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

"ఆ రోజు ఉదయం పక్కా ప్రణాళికతో చిత్రీకరణ ప్రారంభించాం. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. అంతా మంచి జరగాలని ప్రతి చిత్రం యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రార్థిస్తాం. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనూ అలాగే చేశాం. కానీ అనుకోకుండా ఒకరు కన్నుమూశారు. ఈ సంఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది" అని పా. రంజిత్ నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ విచారం వ్యక్తం చేసింది.

మోహన్ అన్న అంటే స్టంట్ టీమ్‌తో పాటు చిత్ర బృందానికి ఎంతో గౌరవమని పా. రంజిత్, ఆయన నిర్మాణ సంస్థ తెలిపింది. స్టంట్స్ డిజైన్, ప్లానింగ్, అమలు ఇలా అన్నీ తెలిసిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అసమాన ప్రతిభ కలిగిన వ్యక్తిని కోల్పోయామని పేర్కొన్నారు. అందరూ గర్వపడేలా ఆయన పని చేసేవారని, ఆయన మా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని పేర్కొన్నారు.
Pa Ranjith
Pa Ranjith director
Vettuvam movie
stuntman death
Mohan Raj death
Arya actor

More Telugu News