Sanjay Dutt: ముంబై పేలుళ్లకు సంజయ్ దత్ ను నిందించిన మాజీ న్యాయవాది

Ujjwal Nikam says Sanjay Dutt could have prevented Mumbai blasts
  • ఆయన సమాచారం ఇచ్చి ఉంటే పేలుళ్లు జరిగేవి కావన్న ఉజ్వల్ నికమ్
  • ముంబై పేలుళ్ల కేసులో ప్రభుత్వ స్పెషల్ ప్రాసిక్యూటర్ గా ఉజ్వల్
  • ఉజ్వల్ ను ఇటీవలే రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై పేలుళ్లకు సంబంధించి ఈ కేసులో వాదనలు వినిపించిన మాజీ న్యాయవాది ఉజ్వల్ నికమ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే ఆయనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థ ఉజ్వల్ నికమ్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో సంజయ్ దత్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ముంబై పేలుళ్లు జరిగేవి కావని చెప్పారు. ఈ కేసులో ఉజ్వల్ నికమ్ ప్రభుత్వ స్పెషల్ ప్రాసిక్యూటర్ గా వాదనలు వినిపించారు.

నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ.. 1993 మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయని చెప్పారు. ఈ పేలుళ్లకు కొన్నిరోజులు ముందు సంజయ్ దత్ నివాసానికి ఓ వ్యాన్ వచ్చిందన్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూసలేం ఈ వ్యాన్ ను తీసుకొచ్చాడని, అందులో గ్రనేడ్లు, ఏకే 47, తుపాకులు తదితర మారణాయుధాలు ఉన్నాయని ఉజ్వల్ నికమ్ చెప్పారు. ఆ మారణాయుధాలను పరిశీలించిన సంజయ్ దత్.. ఒక ఏకే 47 ను తీసుకుని తనవద్దే ఉంచుకున్నారని తెలిపారు. 

అయితే, ఆ వ్యాన్ గురించి సంజయ్ దత్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఉజ్వల్ నికమ్ ఆరోపించారు. ఒకవేళ ఆయన సమాచారం ఇచ్చి ఉంటే పోలీసులు దర్యాప్తు చేసేవారని, తద్వారా పేలుళ్లు జరిగి ఉండేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. అబూ సలేం తెచ్చిన వ్యాన్ నుంచి సంజయ్ దత్ ఓ ఏకే 47 తీసుకున్న విషయం నిజమేనని కోర్టులో నటుడి తరపు న్యాయవాది కూడా అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. అయితే, సంజయ్ దత్ దానిని ఎప్పుడూ కాల్చలేదని వాదించారని ఉజ్వల్ నికమ్ తెలిపారు. ఈ వ్యవహారంలో సంజయ్ దత్ పై తొలుత టాడా చట్టం కింద కేసు నమోదైందని, విచారణ అనంతరం కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చిందని వివరించారు. అయితే, అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిందని ఉజ్వల్ నికమ్ గుర్తుచేశారు.
Sanjay Dutt
Mumbai blasts
Ujjwal Nikam
1993 Mumbai blasts
Dawood Ibrahim
Abu Salem
TADA Act
Arms Act
Bollywood
Indian Law

More Telugu News