NRI: యూరప్ లో జీవించడం చాల కష్టమన్న ఎన్ఆర్ఐ.. అయితే తిరిగొచ్చేయాలంటూ నెటిజన్ల వ్యంగ్యం

NRI Dev Vijay Vargiya shares difficulties of living in Europe
  • బెడిసికొట్టిన ఎన్ఆర్ఐ వీడియో పోస్టు
  • వాతావరణం భారతీయులకు సరిపడదని వ్యాఖ్య
  • జీవన వ్యయం చాలా ఎక్కువని ఆరోపణ
విదేశాల్లో స్థిరపడాలని చాలామంది ఆశపడుతుంటారు కానీ అదంత సులభం కాదని, దేశం కాని దేశంలో జీవించడం చాలా కష్టమని ఓ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. యూరప్ లో స్థిరపడ్డ తాను నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పోస్టులో పంచుకున్నాడు. ఇంటికి, అయినవాళ్లకు దూరంగా పరాయి దేశంలో బ్రతకడం కష్టంగా ఉంటుందని వివరించాడు. విదేశాల్లో ఎదురయ్యే కష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఆయన పెట్టిన ఈ పోస్టు బెడిసికొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. అంత కష్టంగా ఉంటే ఇంకా అక్కడే ఎందుకు ఉన్నావు సోదరా? స్వదేశానికి తిరిగి వచ్చేయొచ్చు కదా అని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

దేవ్ విజయ్ వర్గీయ అనే సాఫ్ట్ వేర్ డెవలపర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేశాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని తాను స్వీడన్ వచ్చేశానని ఇందులో చెప్పుకొచ్చాడు. ‘విదేశాల్లో స్థిరపడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడ నివసిస్తుంటే కానీ ఇక్కడి కష్టాల గురించి తెలిసిరాలేదు. ఇంటికి దూరంగా ఉండడం ఓ బాధ, పైగా ఇక్కడ జీవన వ్యయం చాలా ఎక్కువ. జీతంలో 30 నుంచి 50 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వమే తీసేసుకుంటుంది. మిగిలినదాంట్లో ఇంటి అద్దె, నిత్యావసరాలకే చాల ఖర్చవుతుంది. ఒంటరితనం వేధిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

‘వాతావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ లలోకి పడిపోతాయి. ఇవన్నీ పక్కన పెడితే.. ఇక్కడ ఎంత కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నా, పన్నులు కడుతున్నా సరే.. ఖర్మకాలి ఉద్యోగం కానీ పోయిందంటే వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే. మీరు ఇక్కడ ఉండాలా వెళ్లిపోవాలా అనేది మీ ఉద్యోగంపైనే ఆధారపడి ఉంటుంది’ అంటూ స్వీడన్ లో తాను ఎదుర్కొంటున్న పలు సమస్యలను దేవ్ విజయ్ ఈ వీడియోలో ఏకరువు పెట్టాడు. యూరప్ కు వచ్చే వారికి అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో పోస్ట్ చేసినట్టు తెలిపాడు.

అయితే, దీనిపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. స్వీడన్ లో నివసించడం అంత కష్టంగా ఉంటే ఇంకా అక్కడే ఎందుకున్నారని కామెంట్లలో నిలదీస్తున్నారు. స్వదేశానికి రాకుండా అక్కడ నిన్ను ఎవరు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దేవ్ విజయ్ చెప్పిన వాటిలో కొన్ని తప్పులు కూడా ఉన్నాయని మరో నెటిజన్ ఆరోపించాడు. ఉద్యోగం కోల్పోయిన వారం రోజుల్లోనే దేశం విడిచిపెట్టాల్సిన అవసరంలేదని, కనీసం మూడు నెలలు అక్కడే ఉండే వీలును చట్టం కల్పిస్తుందని, పర్మనెంట్ రెసిడెంట్ అయితే దేశం విడిచిపెట్టే అవసరమే ఉండదని మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.
NRI
Europe
Sweden
Dev Vijay Vargiya
living abroad
software developer
job loss
taxes
cost of living
Indian diaspora

More Telugu News