DGCA: బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్‌లు.. డీజీసీఏ కీలక ఆదేశాలు

DGCA Orders Fuel Switch Checks on Boeing Aircraft
  • ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం!
  • ప్రాథమిక నివేదికలో వెల్లడి!
  • బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలన్న డీజీసీఏ
  • ఈ నెల 21 లోగా స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలన్న డీజీసీఏ
బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్‌ల అంశంపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం చోటు చేసుకున్నట్లు విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. దీంతో విమానాల్లో ఇంధన స్విచ్‌లపై చర్చ మొదలైంది.

ఈ క్రమంలో డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని సూచించింది.

అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన 'స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ ఇన్‌ఫర్మేషన్' బులెటిన్స్ ప్రకారం, ప్రస్తుతం అనేక అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలు వారి విమానాల్లో తనిఖీలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల ఆపరేటర్లు ఈ నెల 21 లోగా ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థల తనిఖీలు పూర్తి చేయాలని డీజీసీఏ తన ఉత్తర్వులో పేర్కొంది. సంబంధిత నివేదికను డీజీసీఏకు సమర్పించాలని సూచించింది.

భారత్‌కు చెందిన ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ్ ఎయిర్, స్పైస్ జెట్ వంటి సంస్థలు ప్రస్తుతం బోయింగ్ 787, 737 రకం విమానాలను నడుపుతున్నాయి. మరోవైపు, ఇత్తెహాద్ ఎయిర్ వేస్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన విమానయాన సంస్థలు ఇంధన స్విచ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ పైలట్లకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు కథనాలు వచ్చాయి.
DGCA
Boeing 787
Boeing 737
Ahmadabad flight accident
Fuel switch issue
Air India

More Telugu News