కశ్యప్‌తో విడాకులు నిజమే.. నిర్ధారించిన సైనా నెహ్వాల్

  • ఏడేళ్ల వివాహ బంధానికి సైనా-కశ్యప్ ఫుల్‌స్టాప్
  • ఇన్‌స్టా పోస్టుతో నిర్ధారించిన సైనా నెహ్వాల్
  • తమ గోప్యతను గౌరవించాలని సూచన
  • 2018లో పెళ్లి చేసుకున్న జంట
భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రముఖ షట్లర్ కశ్యప్ పారుపల్లి విడిపోయారు. 2018లో వివాహం చేసుకున్న వీరు ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘జీవితం కొన్నిసార్లు వేర్వేరు మార్గంలో తీసుకెళ్తుంది’ అని దానికి క్యాప్షన్ తగిలించింది. సుదీర్ఘ చర్చలు, ఎన్నో ఆలోచనల తర్వాత కశ్యప్ పారుపల్లి, తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. తాము ప్రశాంతత, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకున్నామని తెలిపింది. తమను అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలని పేర్కొన్న సైనా.. తమ గోప్యతను గౌరవించాలని సూచించింది. కాగా, కశ్యప్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. సైనా చేసిన ఈ ప్రకటన ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది.  

బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ సమయంలో మొదలైన సైనా-కశ్యప్ స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో 2018లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన సైనా నెహ్వాల్ ప్రస్తుతం గాయాల బారినపడి ఫామ్ కోల్పోయింది. 2023 జూన్‌లో చివరిసారి ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఆడింది. తాను ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్టు గతేడాది ప్రకటించింది. కాగా, కాంపిటీటివ్ బ్యాడ్మింటన్‌ నుంచి రిటైరైన కశ్యప్ ప్రస్తుతం కోచింగ్‌పై దృష్టి సారించాడు.  


More Telugu News