Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు

Teenmar Mallanna case filed after clash with Telangana Jagruthi activists
  • తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి, ఫర్నీచర్ ధ్వంసం
  • గాలిలోకి కాల్పులు జరిపిన తీన్నార్ మల్లన్న గన్ మెన్ 
  • ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 
ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిన్న ఉదయం మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు.

కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో జాగృతి కార్యకర్త సాయికి బుల్లెట్ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి.

తొలుత తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దాడికి దిగారని, ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఐపీసీ 147, 148, 452, 307, 427, 506, 353 రెడ్ విత్ 149, 109 సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు అయింది. మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూన్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లగా, మల్లన్న వర్గం తమపై దాడి చేసి కత్తులు, తుపాకులతో మహిళలను బెదిరించారని, మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు. దీనిపై 354 బీ, 307, 506, 147, 148, ఆర్మ్స్ యాక్ట్ 25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
Teenmar Mallanna
Chintapandu Naveen Kumar
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
BRS MLC
Medipally
Gun firing
Q News office attack
Sai Jagruthi activist
Rachakonda police

More Telugu News