Ann Eckhardt: సినిమాల్లో గుండెపోటులను తప్పుగా చూపిస్తున్నారంటున్న పరిశోధకులు!

Hollywood films portray heart attacks inaccurately says Ann Eckhardt
  • సినిమాల్లో గుండె పట్టుకుని కుప్పకూలిపోయే సన్నివేశాలు
  • గుండెపోటులు వాస్తవానికి ఇలా ఉండవంటున్న పరిశోధకులు
  • ప్రజలు వైద్య సాయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని వెల్లడి
హాలీవుడ్ చిత్రాల్లో గుండెపోటు సన్నివేశాలను చూపించే విధానం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. సినిమాల్లో చూపించినట్టుగా ఛాతీని పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వంటి నాటకీయ దృశ్యాలు వాస్తవ జీవితంలో కనిపించవని టెక్సాస్ ఎట్ ఆర్లింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన నర్సింగ్ ప్రొఫెసర్ ఆన్ ఎక్‌హార్డ్ తెలిపారు. నిజానికి హార్ట్ అటాక్ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయని, తీవ్రమైన నొప్పి కాకుండా అసౌకర్యం, ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించడం వంటివి ఉంటాయని ఆమె నొక్కి చెప్పారు. దీనివల్ల ప్రజలు వైద్య సహాయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఎక్‌హార్డ్, ఆమె బృందం ఈ అపోహలను సరిదిద్దడానికి కృషి చేస్తున్నారు. వారు 'ఛాతీ నొప్పి అవగాహన ప్రశ్నావళి'ని అభివృద్ధి చేశారు. ప్రజలు హార్ట్ అటాక్ ల గురించి టీవీ లేదా సినిమాల నుంచి చాలా సమాచారం పొందుతున్నారని ఈ ప్రశ్నావళి ద్వారా తేలింది. గుండెపోటు లక్షణాలు పురుషులు, స్త్రీలలో ఎంతో భిన్నంగా ఉంటాయనే అపోహను కూడా ఈ పరిశోధన ఖండించింది. స్త్రీపురుషులిద్దరిలోనూ ఛాతీకి సంబంధించిన లక్షణాలు సర్వసాధారణమని స్పష్టం చేసింది. 

హాలీవుడ్ సినిమాలు తరచుగా గుండెపోటులను అతిగా నాటకీయం చేసి చూపిస్తాయని, దీనివల్ల ప్రజలు నిజమైన లక్షణాలను గుర్తించడంలో విఫలమవుతున్నారని ఆన్ ఎక్ హార్ట్ తెలిపారు. ఉదాహరణకు, సినిమాల్లో బాధితులు అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పిని అనుభవించి, కూలిపోతారు. అయితే, వాస్తవానికి, చాలామందికి లక్షణాలు నెమ్మదిగా మొదలై, తేలికపాటి నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటాయి. ఇది అజీర్తి, కండరాల నొప్పి లేదా అలసట వంటి సాధారణ సమస్యలుగా భ్రమించేలా చేస్తుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల, అత్యవసర చికిత్స ఆలస్యమై, గుండెకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఆమె వివరించారు.

ఈ పరిశోధన ప్రధానంగా గుండెపోటు లక్షణాలపై ఉన్న సాధారణ అపోహలను తొలగించడంపై దృష్టి సారించింది. ప్రజలు సరైన సమాచారాన్ని పొందడం ద్వారా త్వరగా వైద్య సహాయం పొందగలరని, తద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చని ఎక్‌హార్డ్ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ పరిశోధన ప్రజలకు, వైద్య సంఘానికి గుండెపోటు లక్షణాలను బాగా అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి సహాయపడటమే లక్ష్యంగా పెట్టుకుంది. చికిత్స ఆలస్యం కావడం వల్ల కలిగే కోలుకోలేని గుండె నష్టాన్ని ఈ పరిశోధన ఫలితాల ద్వారా తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు.
Ann Eckhardt
Hollywood movies
heart attacks
heart attack symptoms
chest pain
cardiac arrest
heart health
Texas at Arlington
nursing professor
chest pain awareness

More Telugu News