Kalvakuntla Kavitha: తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి... అరెస్ట్ చేయాలి: కవిత డిమాండ్

Kalvakuntla Kavitha Demands Suspension and Arrest of Teenmar Mallanna
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కవిత సంబరాలు
  • కవితకేంటి సంబంధం అంటూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు
  • డీజీపీకి, శాసనమండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు
తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీకి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని, అతడిని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. దీనిపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ, బీసీ రిజర్వేషన్లకు, కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆమెపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీలతో ఆమెకు కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.

మల్లన్న వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. తనపై, జాగృతి కార్యకర్తలపై కాల్పులకు పురిగొల్పేలా మల్లన్న మాట్లాడారని కవిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని, బీసీల పక్షాన పోరాడుతున్నందుకే తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

మరోవైపు, తన కార్యాలయంపై దాడి జరిగిన ఘటనపై తీన్మార్ మల్లన్న కూడా స్పందించారు. కవిత అనుచరులు తనపై హత్యాయత్నం చేశారని, తన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రాణాలతో బయటపడ్డానని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Kalvakuntla Kavitha
Teenmar Mallanna
Kavitha
Telangana MLC
BRS MLC
Telangana Politics
BC Reservations
Gutta Sukhender Reddy
Telangana Jagruthi
Controversial Comments

More Telugu News