Kota Srinivasa Rao: కోట ఒకే సీన్ లో రెండు రకాలుగా నటించగలరు: సీఎం చంద్రబాబు

Kota Srinivasa Rao Could Act Two Ways in One Scene Says Chandrababu
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట
  • ఆదివారం తెల్లవారుజామున కన్నుమూత
  • కోట భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని కోట నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోట శ్రీనివాసరావు నటనా ప్రతిభ, సినీ రంగానికి చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. 

కోట శ్రీనివాసరావు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో 750కి పైగా చిత్రాల్లో నటించి, విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారని వివరించారు. "కోట శ్రీనివాసరావు గారి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన కళాత్మక కృషి, నటనా నైపుణ్యం ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

"కోట శ్రీనివాసరావుతో నాకు సన్నిహిత అనుబంధం ఉంది. 1999లో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కోట బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. పదవీకాలంలో ప్రజాసేవకు పాటుపడ్డారు. కోట నటనాపరంగా ఎంతో ప్రతిభావంతుడు. ఒకే సీన్ లో ఏడిపించగలరు, భయపెట్టగలరు... ఆ సామర్థ్యం కోట సొంతం. పద్మశ్రీ, 7 నంది అవార్డులతో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు" అని చంద్రబాబు వివరించారు.

కోట మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు కొనియాడారు.
Kota Srinivasa Rao
Chandrababu Naidu
Telugu cinema
actor death
Andhra Pradesh politics
film industry
Nandi Awards
Revanth Reddy
Venkiah Naidu
Tollywood

More Telugu News