వాళ్లిద్దరిపై ఉన్న అసహనాన్ని నాపై చూపిస్తానంటే కుదరదు: తీన్మార్ మల్లన్న

  • క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి
  • తీవ్రంగా స్పందించిన తీన్మార్ మల్లన్న
  • కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్
  • మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కేస్తానంటూ హెచ్చరిక
హైదరాబాదులోని క్యూ న్యూస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు దాడికి పాల్పడడం తెలిసిందే. దీనిపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి కూడా గాయమైందని వెల్లడించారు. తన గన్ మన్ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటువంటి దాడులతో  బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటేనని అన్నారు. బీసీల సమస్యలపై తాము ప్రభుత్వంతో పోరాడుతుంటే కవితకు ఎందుకు భాధ అని మల్లన్న ప్రశ్నించారు. 

కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్ పై ఉన్న అసహనాన్ని కవిత తమపై ప్రదర్శిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు పురిగొల్పిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు  చేయాలని డిమాండ్ చేశారు. అయినా, తాను ఇటువంటి దాడులకు భయపడేది లేదని, మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కడం ఖాయం అని హెచ్చరించారు. 

అంతకుముందు, ఓ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ... బీసీలతో మీకు కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అంటూ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జాగృతి కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి దిగినట్టు సమాచారం.


More Telugu News