Delhi Crime: రోడ్డుపై మొబైల్ ఫోన్ చోరీ.. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి

Delhi Crime Wife Orchestrates Phone Theft to Hide Affair
  • బాధితుడి భార్యకు వివాహేతర సంబంధం
  • ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు తన ఫోన్‌లో ఫొటోలు
  • ఆమె నిద్రపోతున్నప్పుడు ఆ ఫొటోలను తన ఫోన్‌లోకి పంపించుకున్న భర్త
  • వాటిని బయటపెడతానన్న ఉద్దేశంతో ఫోన్ చోరీ చేయించిన భార్య
  • నిందితుడు, బాధితుడి భార్య అరెస్ట్
విధుల నుంచి ఇంటికి వస్తున్న ఓ వ్యక్తి ఫోన్‌ను స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దొంగిలించి పరారయ్యారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు 70 సీసీటీవీ కెమెరాలను వడపోశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. చోరీకి ప్లాన్ చేసింది బాధితుడి భార్యేనని, ప్రియుడితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు బయట పడకుండా ఉండేందుకే ఈ చోరీ చేయించిందని పోలీసులు నిర్ధారించారు. 

దక్షిణ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓల్డ్ యూకే పెయింట్ ఫ్యాక్టరీ సమీపంలో ఫోన్ చోరీకి గురైనట్టు జూన్ 19న పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో 70 సీసీటీవీ కెమెరాలను వడపోసి నిందితుడు నీలం రంగు టీ-షర్ట్ ధరించినట్టు గుర్తించారు. అలాగే, స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా గుర్తించారు. దానిని అంతకుముందు రోజే దర్యాగంజ్ నుంచి అద్దెకు తీసుకున్నట్టు నిర్ధారించారు. స్కూటర్‌ను అద్దెకు తీసుకున్నప్పుడు ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు రాజస్థాన్‌, బార్మర్ జిల్లాలోని బలోత్రాకు వెళ్లి నిందితుడు అంకిత్ గహ్లోత్‌ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. 

బాధితుడి భార్యే తనతో ఒప్పందం కుదుర్చుకుందని, ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని తెలిపాడు. ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె తీసుకున్న ఫొటోలు భర్త ఫోన్‌లోకి చేరాయని, వాటిని డిలీట్ చేయాలని భావించి సెల్‌ఫోన్ చోరీ కోసం తమతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పాడు. భర్త ఎప్పుడు ఎలా వస్తాడో, అతడి ఆఫీస్ టైమింగ్స్ ఏంటో కూడా చెప్పిందని తెలిపాడు. దీంతో నిందితుడితోపాటు బాధితుడి భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ ఘటనలో మరో ట్విస్ట్ కూడా ఉంది. భార్య వివాహేతర సంబంధం గురించి భర్తకు కూడా తెలుసని, ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్‌లోని ఫొటోలను తన ఫోన్‌లోకి పంపించుకున్నట్టు పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన భార్య.. ఆ ఫొటోలను తన కుటుంబ సభ్యులకు ఎక్కడ చూపిస్తాడోనన్న భయంతోనే ఆమె ఈ ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 
Delhi Crime
Phone Theft
Extra Marital Affair
CCTV Footage
Ankit Gahlot
Rajasthan
Police Investigation
Crime News
Delhi Police
Mobile Phone Theft

More Telugu News