Bihar Police: డ్యూటీలో మహిళా పోలీస్‌లు ఆభరణాలు ధరించడం, మేకప్ వేసుకోవడంపై బీహార్ పోలీసుల నిషేధం

Bihar Police Bans Jewelry Makeup for Women Citing Discipline
  • యూనిఫాం, మేకప్‌తో మహిళా పోలీసుల రీల్స్ నేపథ్యంలో ఆదేశాలు
  • ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిక
  • పురుష పోలీసులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయన్న ఏడీజీ పంకజ్ దరాద్
మహిళా పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నగలు ధరించకూడదని, మేకప్ వేసుకోకూడదని బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాలు జారీచేసింది. దీనిని అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అదనపు డైరెక్టర్ జనరల్ (లా) పంకజ్ దరాద్ సంతకంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, ముక్కు, చెవులకు రింగులు ధరించడం, గాజులు, ఆభరణాలు ధరించడం, విధుల్లో ఉన్నప్పుడు కాస్మొటిక్స్ ఉపయోగించడంపైనా నిషేధం విధించారు. మహిళా పోలీసులు యూనిఫాం, ఆభరణాలు ధరించి భారీ మేకప్‌తో చేస్తున్న రీల్స్ వైరల్ కావడంతో ఈ ఆదేశాలు జారీచేశారు. ఇటువంటివి చేయడాన్ని సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా హెడ్ క్వార్టర్స్ పేర్కొంది. అంతేకాదు, ఇది పోలీసు మర్యాద, వృత్తి నైపుణ్యానికి మచ్చ అని తెలిపింది.

రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో ఆయుధాలు ప్రదర్శించడం, డ్యూటీలో ఉండగా మ్యూజిక్ వినేందుకు, వ్యక్తిగతంగా కాల్స్ చేయడం కోసం బ్లూటూత్‌ను ఉపయోగించడాన్ని కూడా ఉల్లంఘన జాబితాలో చేర్చారు. ఇలాంటివి విధుల నుంచి దృష్టిని మరలుస్తాయని ఏడీజీ పంకజ్ దరాద్ పేర్కొన్నారు. ఇలాంటి కారణాలతోనే ఇటీవల 10 మంది మహిళా పోలీసులు సస్పెండ్ అయ్యారు. అలాగే, పురుష పోలీసులు కూడా విధులకు బద్ధులై ఉండాలని, యూనిఫాం గౌరవాన్ని కాపాడాలని సూచించారు. అంతేకాదు, ఈ ఆదేశాలు పురుషులకూ వర్తిస్తాయని పేర్కొన్నారు.
Bihar Police
Bihar Police jewelry ban
Bihar Police makeup ban
Indian Police
women police officers
police dress code
police regulations
police discipline
Pankaj Darad
police rules

More Telugu News