Afghanistan Child Marriage: ఇంతకంటే ఘోరం ఉంటుందా... ఆరేళ్ల పాపను పెళ్లాడిన ఆఫ్ఘన్ వ్యక్తి... ఆమెకు 9 ఏళ్లు వచ్చేదాకా ఆగాలన్న తాలిబన్లు!

Afghanistan Child Marriage 6 Year Old Forced to Marry
  • ఆఫ్ఘనిస్థాన్‌లో 6 ఏళ్ల బాలికకు 45 ఏళ్ల వ్యక్తితో బలవంతపు వివాహం
  • డబ్బుల కోసం కన్న తండ్రే కూతురిని అమ్మేసిన వైనం
  • విషయం తెలిసి రంగంలోకి దిగి పెళ్లిని అడ్డుకున్న తాలిబన్లు
  • తండ్రిని, వరుడిని అరెస్ట్ చేసిన స్థానిక అధికారులు
  • సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వైరల్.. తీవ్ర ఆగ్రహావేశాలు
  • తాలిబన్ల పాలనలో బాల్య వివాహాలు పెరిగాయన్న ఐక్యరాజ్యసమితి నివేదిక
 ఆఫ్ఘనిస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే తన ఆరేళ్ల కూతురిని డబ్బు కోసం 45 ఏళ్ల వ్యక్తికి అమ్మి పెళ్లి జరిపించాడు. ఈ అమానవీయ ఘటన దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని మర్జా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వివరాల్లోకి వెళితే, మర్జా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పేదరికం కారణంగా తన ఆరేళ్ల కుమార్తెను 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇప్పటికే ఇద్దరు భార్యలున్న ఆ వ్యక్తి, బాలిక కుటుంబాన్నికి డబ్బు చెల్లించి ఈ పెళ్లికి ఒప్పించినట్లు అమెరికాకు చెందిన అము.టీవీ అనే మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అవి పెను దుమారం రేపుతున్నాయి. చిన్నారి పక్కన కూర్చున్న మధ్య వయస్కుడైన వరుడిని చూసి నెటిజన్లు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక తాలిబన్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వారి తీరు మరీ విడ్డూరం...! వారు ఆ వ్యక్తి, బాలికను తన ఇంటికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, బాలికకు తొమ్మిదేళ్లు నిండిన తర్వాత భర్త ఇంటికి పంపవచ్చని వారు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై తాలిబన్ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, బాలిక తండ్రిని, వరుడిని అరెస్ట్ చేసినట్లు హష్త్-ఎ-సుభ్ డైలీ అనే పత్రిక తెలిపింది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లిదండ్రుల వద్దే సురక్షితంగా ఉంది.

ఆఫ్ఘనిస్థాన్‌లో 2021లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి బాల్య వివాహాలు గణనీయంగా పెరిగాయి. తీవ్రమైన పేదరికం, బాలికల విద్యపై ఆంక్షలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గతేడాది ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం, తాలిబన్ల పాలనలో బాల్య వివాహాలు 25% పెరిగాయని, ఇది బాలికల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Afghanistan Child Marriage
Child Marriage
Taliban
Afghanistan
Marja District
Poverty
Human Rights
Girls Education
United Nations

More Telugu News