Yashaswini Reddy: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రతి పనిలో ఝాన్సీరెడ్డి జోక్యం చేసుకుంటున్నారు: సొంత పార్టీ నేత ఆగ్రహం

Yashaswini Reddy MLA Interference by Jhansi Reddy Angers Own Party leader
  • పాల‌కుర్తి కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు
  • ఇన్‌ఛార్జ్‌ ఝాన్సీరెడ్డిపై మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ తిరుపతి రెడ్డి తీవ్ర ఆరోపణలు
  • ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఝాన్సీరెడ్డి పనిచేయనివ్వడం లేదని విమర్శ
  • నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్రజల మధ్య చర్చ!
  • గెలుపు కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టారని ఆవేదన
  • ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వారికే ప్రాధాన్యమంటూ ఆగ్రహం
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ ఇన్‌ఛార్జ్‌ ఝాన్సీరెడ్డిపై సొంత పార్టీకే చెందిన సీనియర్ నేత, తొర్రూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి ఆధిపత్యం శృతి మించుతోందని, దీనివల్ల పాలకుర్తిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి రెడ్డి మాట్లాడుతూ "ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్నప్పటికీ, ఝాన్సీరెడ్డి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ఆమెను స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదు" అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను, నాయకులను ఇప్పుడు పూర్తిగా పక్కనపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వారే ఇప్పుడు ఝాన్సీరెడ్డికి అత్యంత సన్నిహితులుగా మారారని తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారు. నేను అమెరికా నుంచి ఝాన్సీరెడ్డిని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించాను. కానీ ఆ తర్వాత వారి తీరు మారింది. ఈ విధానం మార్చుకోవాలని ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు" అని ఆయన తెలిపారు.
Yashaswini Reddy
Jhansi Reddy
Palakurthi
Telangana Congress
Hanumandla Tirupathi Reddy

More Telugu News