Kavitha: కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రండి.. తేల్చుకుందాం: రేవంత్ రెడ్డికి కవిత సవాల్

Kavitha Challenges Revanth Reddy to Debate at Command Control Center
  • మహిళలకు ఇచ్చిన హామీలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చర్చిద్దామన్న కవిత
  • ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని తీవ్ర విమర్శ
  • స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్
  • డిమాండ్ల సాధన కోసం ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపు
  • భద్రాచలం ఐదు గ్రామాల సమస్యపై మంత్రి తుమ్మల చొరవ చూపాలని సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మహిళలందరితో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదేపదే కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని కోరడాన్ని ప్రస్తావిస్తూ, తాము చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ చేశారు.

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ఆడబిడ్డలకు నెలకు రూ. 2,500, తులం బంగారం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి? పింఛన్ల పెంపు సంగతేమిటి? ఈ అంశాలపై చర్చించేందుకు మేం సిద్ధం. మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రండి, తేల్చుకుందాం" అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని, ఆయన మోసాలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ మాట నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళితే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా 'రైల్ రోకో' నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో బీసీలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామ పంచాయతీల సమస్యను ప్రస్తావించిన కవిత, వాటిని తెలంగాణలో విలీనం చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకోవాలని కోరారు. పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయ భూముల పరిశీలనకు వెళ్లిన ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని ఆమె వ్యాఖ్యానించారు.
Kavitha
Kalvakuntla Kavitha
Revanth Reddy
BRS
Telangana Jagruthi
Telangana Politics

More Telugu News