California woman: ఆర్డర్ చేయకున్నా కాలిఫోర్నియాలో 'ఆమె' ఇంటికి వందల పార్శిళ్లు!

California Woman Receives Hundreds of Unordered Packages
  • కాలిఫోర్నియా మహిళ ఇంటికి ఏడాదిగా వందల అమెజాన్ పార్శిళ్లు
  • ఆర్డర్ చేయకపోయినా వస్తున్న బాక్సులతో నిండిపోయిన ఇల్లు
  • ఒక చైనా కంపెనీ తన రిటర్న్ అడ్రస్‌గా ఆమె ఇంటి చిరునామా ఇవ్వడమే కారణం
  • నాసిరకం ఉత్పత్తులన్నీ ఆమె ఇంటికే వాపస్ పంపుతున్న కస్టమర్లు
  • ఆరుసార్లు ఫిర్యాదు చేసినా అమెజాన్ నిర్లక్ష్యం
  • మీడియా కథనంతో స్పందించి బాక్సులు తొలగించిన సంస్థ
మీరు ఆర్డర్ చేయకపోయినా మీ ఇంటికి ఒక పార్శిల్ వస్తే పొరపాటేమో అని సరిపెట్టుకుంటారు. కానీ అదేపనిగా రోజూ వందల కొద్దీ పార్శిళ్లు వస్తూ, ఇల్లంతా నిండిపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వింత అనుభవాన్నే కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌కు చెందిన ‘కే’ అనే మహిళ ఎదుర్కొన్నారు. ఏడాది కాలంగా వస్తున్న పార్శిళ్లతో ఆమె ఇల్లు ఒక గిడ్డంగిలా మారిపోయింది. చివరికి తన కారు పార్క్ చేయడానికి కూడా స్థలం లేకుండా పోయింది.

ఈ పార్శిళ్ల వెనుక ఉన్న అసలు కథను ఆరా తీయగా చైనాకు చెందిన ‘లియాశాండేడియన్‌’ అనే కంపెనీ నిర్వాకం అని తేలింది. నాసిరకమైన కార్ సీట్ కవర్లను తయారు చేసి అమ్మే ఈ సంస్థ, తమ ఉత్పత్తులను వినియోగదారులు వాపస్ పంపేందుకు (రిటర్న్) ‘కే’ ఇంటి చిరునామాను ఇచ్చింది. దీంతో కొనుగోలుదారులు వెనక్కి పంపిన వస్తువులన్నీ ఆమె ఇంటికి చేరడం మొదలైంది.

ఈ సమస్యతో విసిగిపోయిన ‘కే’ అమెజాన్‌కు ఆరుసార్లు ఫిర్యాదు చేశారు. ప్రతిసారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారే తప్ప, పార్శిళ్ల రాక ఆగలేదు. “ఈ బాక్సులను పారేస్తే మీకు 100 డాలర్లు ఇస్తామని కూడా అమెజాన్ ఆఫర్ చేసింది, కానీ నేను ఎందుకు ఆ పని చేయాలని నిరాకరించాను” అని ఆమె ఓ మీడియా సంస్థకు తెలిపారు.

ఈ ఉదంతం మీడియాలో ప్రముఖంగా రావడంతో అమెజాన్ యాజమాన్యం స్పందించింది. బుధవారం ఒక బృందాన్ని ఆమె ఇంటికి పంపి పేరుకుపోయిన బాక్సులన్నింటినీ తొలగించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుంటామని సదరు మహిళకు హామీ ఇచ్చింది. దీంతో ఏడాదిగా ఆమె పడుతున్న ఇబ్బందులకు తెరపడినట్లయింది.
California woman
Amazon
Lixiasandedian
San Jose
unwanted packages
car seat covers

More Telugu News