Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు తిన్న ప్లేట్ ను స్వయంగా తీసిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Picks Up Chandrababus Plate Showing Respect
  • శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో మెగా పీటీఎం 2.0 కార్యక్రమం
  • పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సీఎం, మంత్రి సహపంక్తి భోజనం
  • డాక్టర్ అవుతానన్న విద్యార్థినికి అండగా ఉంటానని లోకేష్ భరోసా
  • ఇస్రో శాస్త్రవేత్త కావాలన్న మరో విద్యార్థినిని అభినందించిన మంత్రి
  • మహిళలను కించపరిచే పదాలు వాడొద్దని లోకేశ్ పిలుపు
తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు భోజనం చేసిన ప్లేటును రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా తీసి తన వినమ్రతను చాటుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. తండ్రి పట్ల కుమారుడిగా, ముఖ్యమంత్రి పట్ల మంత్రిగా ఆయన చూపిన గౌరవం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 'మెగా పీటీఎం 2.0' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సహపంక్తి భోజనంలో సీఎం, మంత్రులతో పాటు విద్యార్థులు ఒకేచోట కూర్చొని భోజనం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. భోజనం ముగిసిన తర్వాత, చంద్రబాబు లేవగానే ఆయన తిన్న ప్లేటును లోకేశ్ స్వయంగా తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. 9వ తరగతి చదువుతున్న సి. అంజలి అనే విద్యార్థిని, ఆమె తల్లి రాధమ్మను పలకరించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాను డాక్టర్ కావాలనుకుంటున్నానని అంజలి చెప్పగా, ఆమె చదువుకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని లోకేశ్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా, ఇస్రో శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ఉన్న బిందుప్రియ అనే మరో విద్యార్థినిని ఆయన అభినందించారు. ఇటీవలి కేబినెట్‌లో 'ఏపీ స్పేస్ పాలసీ'కి ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

సమాజంలో మార్పు రావాలంటే మహిళలను కించపరిచే పదజాలాన్ని ప్రతి ఒక్కరూ మానుకోవాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Nara Lokesh
Chandrababu Naidu
AP Politics
Andhra Pradesh
Newschevu
AP Space Policy
Mega PTM 2.0
Education
Satyasai District
Student Support

More Telugu News