Indiramma Canteens: ఇడ్లీ, పూరీ, వడ.. హైదరాబాద్ వాసులకు ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ. 5కే బ్రేక్‌ఫాస్ట్

Indiramma Canteens 5 Rupees Breakfast for Hyderabad Residents
  • ఏపీలోని అన్న క్యాంటీన్ల తరహాలో పథకం అమలు
  • 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్ల పంపిణీ
  • హరేకృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో నిర్వహణ
  • ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్ వంటివి సరఫరా
  • క్యాంటీన్ల ఆధునీకరణకు రూ. 11.29 కోట్లు కేటాయింపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలు, సామాన్యులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన అన్న క్యాంటీన్ల స్ఫూర్తితో, ఇక్కడ కూడా అతి తక్కువ ధరకే అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 5కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలోనే ఇకపై రుచికరమైన టిఫిన్ కూడా అందుబాటులోకి రానుంది.

గ్రేటర్ పరిధిలోని 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని జీహెచ్ఎంసీ తీర్మానించింది. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లను ప్రజలకు అందిస్తారు.

ఒక్కో టిఫిన్ తయారీకి రూ. 19 ఖర్చవుతుందని అంచనా వేయగా, లబ్ధిదారుడి నుంచి రూ. 5 వసూలు చేసి, మిగిలిన రూ. 14ను జీహెచ్ఎంసీ సబ్సిడీగా భరించనుంది. ఈ అల్పాహార పథకం కోసం ఏటా సుమారు రూ. 15.33 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. దీంతో పాటు, ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా ఆధునీకరించేందుకు రూ. 11.29 కోట్లు, మరో 11 కేంద్రాల మార్పు కోసం రూ. 13.75 లక్షలు వెచ్చించనున్నారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 30 వేల మందికి పైగా రూ. 5కే భోజనం చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అల్పాహారం కూడా అందుబాటులోకి వస్తుండటంతో మరింత మందికి లబ్ధి చేకూరనుంది. 
Indiramma Canteens
Hyderabad
Telangana Government
Subsidized Breakfast
Five Rupees Breakfast
GHMC
Hare Krishna Movement
Annapurna Canteens
Breakfast Scheme

More Telugu News