Rambabu: తన సినిమా ప్రివ్యూ చూస్తుండగా దర్శకుడికి బ్రెయిన్ స్ట్రోక్‌.. ఆసుపత్రిలో మృతి

Director Rambabu Dies of Brain Stroke During Movie Preview
  • దర్శకుడు సండ్రు నగేష్ (రాంబాబు) బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి
  • ‘బ్రహ్మాండ’ సినిమా ప్రివ్యూ చూస్తుండగా అస్వస్థత
  • హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • విడుదలకు సిద్ధమైన సినిమా.. అంతలోనే తీవ్ర విషాదం
  • మెదక్ జిల్లా స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి
  • సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆమని
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాను ఎంతో ఇష్టపడి దర్శకత్వం వహించిన సినిమా ప్రివ్యూ చూస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన దర్శకుడు సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు (47) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే ఆయన మరణించడంతో చిత్ర యూనిట్‌, ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గుకథ నేపథ్యంలో రాంబాబు ‘బ్రహ్మాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర బృందంతో కలిసి ఆయన ప్రివ్యూ చూస్తున్నారు. అదే సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి ఆయన కన్నుమూశారు.

రాంబాబు మృతివార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు భార్య సరిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిన్న మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఆయన స్వగ్రామమైన అల్లీపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ‘బ్రహ్మాండ’ చిత్ర నిర్మాత దాసరి సురేశ్, నటులు బలగం జయరాం, ఆనంద్ బాల్సద్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాంబాబు గతంలో సుమారు 150 సినిమాలకు, 60 సీరియళ్లకు కో-డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’, ‘అన్వేషణ’ వంటి ప్రముఖ సీరియళ్లకు ఆయన కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు.
Rambabu
Sandru Nagesh
Brahmanda movie
Amani actress
Telugu film industry
Brain stroke
Oggu Katha
Dasari Suresh producer
ETV serials
Tollywood news

More Telugu News