Y. S. Jagan Mohan Reddy: పక్కా ప్రణాళికతోనే జగన్ పర్యటనలు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

Jagans Tours are Planned to Disrupt Peace Alleges Acham Naidu
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నారన్న అచ్చెన్నాయుడు
  • ఐదారు జిల్లాల నుంచి జనాలను తరలించడం ఎందుకని ప్రశ్న
  • పథకం ప్రకారమే రోడ్లపై మామాడి పండ్లు పోశారని విమర్శ
వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న పర్యటనలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన జగన్‌కు లేదని, కేవలం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే పక్కా ప్రణాళికతో యాత్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

జగన్ పర్యటనలు సినిమా సెట్టింగుల్లా ఉన్నాయని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. "పరామర్శకు వెళ్తే రైతులను కలిసి మాట్లాడాలి కానీ, ఐదారు జిల్లాల నుంచి జనాన్ని తరలించడం ఎందుకు? ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే రోడ్లపై మామిడి పండ్లను పోశారు. ఇది క్రిమినల్ మైండ్‌తో చేసే పని" అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

తోతాపురి మామిడి రైతుల సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈసారి 7 లక్షల మెట్రిక్ టన్నుల బంపర్ క్రాప్ రావడం, పల్ప్ పరిశ్రమల వద్ద గతేడాది నిల్వలు ఉండటంతో ధర పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో, పరిశ్రమలతో మాట్లాడి కిలో మామిడిని రూ.8కి కొనేలా ఒప్పించామని, ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున సాయం అందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్న తర్వాత కూడా జగన్ పర్యటనలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. 
Y. S. Jagan Mohan Reddy
Acham Naidu
Andhra Pradesh Politics
Mango Farmers
Government Schemes
Political Criticism
Farmers Welfare
YSRCP
Agriculture
N Chandrababu Naidu

More Telugu News