Vijay: అనుభవం లేకుండా హఠాత్తుగా వస్తున్నారు: హీరో విజయ్‌పై కనిమొళి పరోక్ష వ్యాఖ్యలు

Vijay Criticized by DMK MP Kanimozhi Over Political Entry
  • రాజకీయ అనుభవం లేకుండానే కొందరు వస్తున్నారంటూ చురకలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తేడా కూడా తెలియదని వ్యాఖ్య
  • ముఖ్యమంత్రి స్టాలిన్‌కు దీర్ఘకాల రాజకీయ అనుభవం ఉందని వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ
  • డీఎంకే, బీజేపీతో పొత్తు ఉండదని ఇప్పటికే స్పష్టం చేసిన విజయ్
తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో అధికార డీఎంకే, ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా డీఎంకే ఎంపీ కనిమొళి నటుడు విజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అనుభవం లేని కొందరు అకస్మాత్తుగా తెరపైకి వస్తున్నారని ఆమె విమర్శించారు.

ఎట్టాయపురంలో జరిగిన డీఎంకే పార్టీ సమావేశంలో కనిమొళి మాట్లాడుతూ, "రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని కొందరు అకస్మాత్తుగా ఎక్కడినుంచో వస్తారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలు కూడా తెలుసుకోకుండా ప్రశ్నలు వేస్తుంటారు" అని అన్నారు. ప్రజల కోసం నిజంగా పోరాడాలనుకుంటే ముందు వారి సమస్యలు, రాజకీయాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.

పరిపాలనా వ్యవస్థపై కనీస అవగాహన లేకుండానే ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నారని కనిమొళి విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని, ప్రజలకు అలాంటి నాయకుడే అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.

కాగా, వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు విజయ్ ఇటీవల ప్రకటించారు. తమ సైద్ధాంతిక శత్రువులైన డీఎంకే, బీజేపీలతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కనిమొళి చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Vijay
Vijay Thalapathy
Tamil Nadu politics
DMK
Kanimozhi
Tamilaga Vettri Kazhagam
TVK

More Telugu News