ఆలియా భట్‌కు రూ.77 లక్షలు టోకరా.. మాజీ అసిస్టెంట్ అరెస్ట్

  • బాలీవుడ్ నటి ఆలియా భట్‌కు భారీ ఆర్థిక మోసం
  • వ్యక్తిగత సహాయకురాలి చేతిలో రూ.77 లక్షలు నష్టం
  • నకిలీ బిల్లులు సృష్టించి డబ్బు కాజేసిన వేదిక శెట్టి
  • ఆలియా తల్లి సోనీ రజ్దాన్ పోలీసులకు ఫిర్యాదు
  • పలు రాష్ట్రాలు తిరిగిన నిందితురాలు.. బెంగళూరులో అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్‌కు ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ భారీ షాకిచ్చింది. నమ్మకంగా పనిచేస్తూనే, నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.77 లక్షలు కాజేసింది. ఈ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పలు రాష్ట్రాల్లో గాలించి ఎట్టకేలకు నిందితురాలిని బెంగళూరులో అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. వేదిక ప్రకాశ్‌ శెట్టి (32) అనే మహిళ 2021 నుంచి 2024 వరకు ఆలియా భట్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఈ సమయంలో ఆలియా వ్యక్తిగత ఖాతాలతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్’ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకునేది. 2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్య కాలంలో వేదిక నకిలీ బిల్లులతో రూ.76.9 లక్షలను పక్కదారి పట్టించినట్టు పోలీసులు గుర్తించారు.

ప్రయాణాలు, మీటింగ్‌లు, ఇతర ఖర్చుల పేరుతో వేదిక నకిలీ బిల్లులను తయారుచేసి, వాటిపై ఆలియా సంతకాలు తీసుకునేది. ఆ బిల్లులు అచ్చం అసలువాటిలా కనిపించేందుకు ప్రొఫెషనల్ టూల్స్ వాడినట్లు విచారణలో తేలింది. ఆమోదం పొందిన తర్వాత ఆ డబ్బును తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ చేయించి, అక్కడి నుంచి తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకునేదని పోలీసులు తెలిపారు.

ఈ ఆర్థిక అవకతవకలను గుర్తించిన ఆలియా తల్లి, నటి-దర్శకురాలు సోనీ రజ్దాన్ ఈ ఏడాది జనవరి 23న జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్, నమ్మకద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల గాలింపు మొదలవడంతో వేదిక పరారైంది. రాజస్థాన్, కర్ణాటక, పూణే వంటి ప్రాంతాల్లో తలదాచుకుంది. చివరికి ఆమె ఆచూకీని బెంగళూరులో గుర్తించిన జుహు పోలీసులు, అక్కడికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తరలించారు.


More Telugu News