PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం.. బ్రెజిల్ అత్యున్నత పురస్కారం ప్రదానం

Brazil confers its highest honour on PM Modi
  • ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ అవార్డుతో సత్కారం
  • మోదీ అందుకున్న 26వ అంతర్జాతీయ పురస్కారం ఇది
  • ప్రస్తుత ఐదు దేశాల పర్యటనలోనే ఇది మూడో అత్యున్నత గౌరవం
  • ఇటీవలే ఘనా, ట్రినిడాడ్ దేశాల నుంచి కూడా ప్రతిష్ఠాత్మక అవార్డులు
  • మోదీ ప్రపంచ స్థాయి నాయకత్వానికి గుర్తింపుగా పురస్కారాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అందుకుంటున్న పురస్కారాల జాబితాలో తాజాగా బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం కూడా చేరింది. తన అధికారిక పర్యటనలో భాగంగా బ్రెజిల్‌లో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మంగళవారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ప్రధాని మోదీ అందుకున్న 26వ అంతర్జాతీయ గౌరవం ఇది కావడం విశేషం. అంతేకాకుండా జులై 2న ప్రారంభమైన తన ప్రస్తుత ఐదు దేశాల పర్యటనలో ఆయనకు లభించిన మూడో అత్యున్నత పురస్కారం కూడా ఇదే. అంతకుముందు బ్రెసీలియాలోని అల్వొరాడా ప్యాలెస్‌కు చేరుకున్న మోదీకి 114 గుర్రాలతో కూడిన సైనిక వందనంతో బ్రెజిల్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.

ఈ పర్యటనలోనే గత శుక్రవారం ట్రినిడాడ్ అండ్ టొబాగో తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్‌ టొబాగో’ను మోదీకి అందించింది. మోదీ ప్రపంచ స్థాయి నాయకత్వ పటిమ, ప్రవాస భారతీయులతో ఆయనకున్న అనుబంధం, కోవిడ్ మహమ్మారి సమయంలో అందించిన మానవతా సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఇచ్చినట్లు ఆ దేశ ప్రధాని కమలా పెర్సాద్ బిస్సేస్సర్ తెలిపారు. అంతకుముందు ఘనా దేశం కూడా తమ జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో మోదీని సత్కరించింది.
PM Modi
Brazil
Luiz Inacio Lula da Silva
Grand Collar of the National Order of the Southern Cross
Trinidad and Tobago
Kamla Persad Bissessar
Order of the Republic of Trinidad and Tobago

More Telugu News