Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock Market Ends on a Positive Note Amid Volatility
  • 270 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 61 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.71
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు, ట్రేడింగ్ చివరి గంటలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ, సూచీలు లాభాల్లో ముగియడం గమనార్హం. సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 25,522 వద్ద ముగిసింది. 

అమెరికా టారిఫ్ విధానాలపై నెలకొన్న అనిశ్చితి, భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడంతో మదుపర్లు రోజంతా అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే, చివరి అరగంటలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.

సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో పాటు ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, ఎన్టీపీసీ, బీఈఎల్ షేర్లు రాణించాయి. మరోవైపు, టైటాన్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టాలను చవిచూశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.71 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.37 డాలర్లుగా ఉండగా, ఔన్స్ బంగారం ధర 3,333 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
Stock Market
Sensex
Nifty
Share Market
Indian Stock Market
HDFC Bank
Kotak Mahindra Bank
ICICI Bank
Banking Shares
Rupee Value

More Telugu News