Anil Kumar Yadav: ప్రసన్నను చంపేందుకే 200 మందితో దాడి చేశారు: అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav Alleges Attack on Prasanna Kumar Reddy Was Murder Attempt
  • మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి
  • ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టాలన్న అనిల్
  • తనను కూడా జైలుకు పంపాలని చూస్తున్నారని వ్యాఖ్య
నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని హత్య చేసేందుకే ఆయన ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. సుమారు 200 మంది మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, ఈ ఘటన వెనుక ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కలిసి జిల్లా ఏఎస్పీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. "ప్రసన్నను హతమార్చేందుకే 200 మందికి పైగా దుండగులు పెద్ద పెద్ద మారణాయుధాలతో ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆయన తల్లి షాక్‌కు గురయ్యారు. ఆమెకు ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు?" అని అనిల్ ప్రశ్నించారు. ఈ దాడికి పాల్పడిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డితో పాటు వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

"నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. క్వార్ట్జ్ విషయంలో నన్ను జైలుకు పంపిస్తే, నా తర్వాత మొదట జైలుకు వెళ్లేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే" అంటూ అనిల్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. ప్రసన్నకుమార్ రెడ్డిని అంతం చేయాలనే పథకంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దేవుడి దయవల్లే ఆయన ప్రాణాలతో బయటపడ్డారని, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. టీడీపీ నేతలు విష సంస్కృతికి తెరలేపారని ఆయన విమర్శించారు.
Anil Kumar Yadav
Nallapureddy Prasanna Kumar Reddy
Kovur
Nellore Politics
Assault Allegation
Prashanti Reddy
Vemireddy Prabhakar Reddy
Andhra Pradesh Politics
Murder Attempt
Chandrasekhar Reddy

More Telugu News