YV Subba Reddy: తండ్రిని మించిన తనయుడు జగన్.. మళ్లీ అధికారంలోకి వస్తాం: వైవీ సుబ్బారెడ్డి

YS Jagan Exceeded His Father YSR in Welfare Schemes Says YV Subba Reddy
  • కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతోందన్న వైవీ
  • కూటమి అరాచకాలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు 
  • తండ్రిని మించిన సంక్షేమాన్ని జగన్ అందించారని కితాబు
రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకే అధికారాన్ని వినియోగిస్తోందని, వారి పాలనలో అరాచకం కొనసాగుతోందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా విమర్శించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

దివంగత నేత వైఎస్సార్‌ను స్మరించుకుంటూ, ఆయన రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సుబ్బారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఆయన పాలన సాగించారని గుర్తు చేసుకున్నారు.

వైఎస్సార్ ఆశయాలను ఆయన తనయుడు జగన్ పది అడుగులు ముందుకు తీసుకెళ్లారని సుబ్బారెడ్డి ప్రశంసించారు. తండ్రిని మించిన సంక్షేమాన్ని అందించి, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని తెలిపారు. వైఎస్సార్, జగన్ ఇద్దరూ 'రైతే రాజు'గా ఉండాలనే లక్ష్యంతో పాలన అందించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను సమష్టిగా తిప్పికొట్టి, మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
YV Subba Reddy
YS Jagan
YS Rajasekhara Reddy
YSR Congress Party
Andhra Pradesh Politics
TDP Government
Revanth Reddy
Telugu States
Welfare Schemes
Political Criticism

More Telugu News