Anam Ramanarayana Reddy: వీఆర్ స్కూల్ పేరు మార్పుపై మంత్రి ఆనం అసంతృప్తి.. మరో మంత్రిపై సంచలన వ్యాఖ్యలు

Anam Ramanarayana Reddy Displeased with VR School Name Change Slams Minister Narayana
  • నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ను వీఆర్ మున్సిపల్ హైస్కూల్ గా మార్పు చేసిన ప్రభుత్వం
  • స్కూల్ పేరు మార్పు సబబు కాదన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 
  • పాఠశాల అభివృద్ధికి మంత్రి సహకరిస్తే స్కూల్ పేరు మారుస్తారా అని నిలదీత
నెల్లూరులోని వీఆర్ హైస్కూల్‌ పేరును వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌గా మార్చడంపై ఆ జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, మరో మంత్రి పొంగూరు నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాఠశాల అభివృద్ధికి పురపాలక శాఖ మంత్రి సహకరిస్తే, పాఠశాల పేరును కార్పొరేషన్ స్కూల్‌గా మారుస్తారా అని ఆయన నిలదీశారు. ఈ పాఠశాల ఆధునికీకరణకు కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు సీఎస్ఆర్ నిధులు ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తూ, ఇందులో కార్పొరేషన్ నిధి ఎక్కడుందో నగర కమిషనర్ సమాధానం చెప్పాలని కోరారు. ఇలాంటి పొరబాట్లు మళ్లీ జరగకుండా మంత్రులు నారా లోకేశ్, నారాయణలు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం కోరారు.

వెంకటగిరి రాజా విద్యాసంస్థలోనే తాను చదువుకున్నానని, 65 ఏళ్ల పాటు వీఆర్ విద్యా సంస్థల నిర్వహణను ఆనం కుటుంబం చూసిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో మేనేజ్‌మెంట్ కమిటీని, అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించారని ఆయన అన్నారు. ఈ పాఠశాల ప్రారంభానికి ముందు వెంకటగిరి రాజులు రూ.50 వేలు ఇస్తామని, దానికి వారి పేరు పెట్టాలని కోరడంతో ఆ పేరు పెట్టామని, ఆ తర్వాత వారు నిధులు ఇవ్వకపోయినా అదే పేరుతో కొనసాగించామని తెలిపారు. ఇప్పుడు ఆ పేరును మార్చడం సబబు కాదని, వీఆర్ హైస్కూల్‌గా ఉంటేనే గౌరవప్రదంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

అంతేకాకుండా కార్పొరేట్ల చేతుల్లో విద్యా వ్యవస్థ చిక్కుకుపోయిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు మంత్రి నారాయణవేనని, ఆయన ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటే తామూ అదే బాటలో నడుస్తామని మంత్రి ఆనం అన్నారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఆనం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
Anam Ramanarayana Reddy
VR School Nellore
Ponguru Narayana
Nellore Politics
School Name Change
Andhra Pradesh Education
Municipal School
Corporate Schools
Nara Lokesh

More Telugu News