Prasanna Kumar Reddy: ప్రసన్నకుమార్ రెడ్డికి ఫోన్ చేసిన జగన్ .. దాడి ఘటనపై ఆరా

Jagan Calls Prasanna Kumar Reddy After Attack on Home
  • వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి 
  • వైఎస్ జగన్ ఫోన్ చేసి ఘటనపై వివరాలు అడిగి తెలుకున్నారన్న ప్రసన్నకుమార్ రెడ్డి
  • దాడి సమయంలో తాను ఇంట్లో ఉంటే హత్య చేసి ఉండేవారన్న ప్రసన్నకుమార్ రెడ్డి 
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై కొందరు దుండగులు నిన్న రాత్రి దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం విదితమే. ఇంట్లోని సామాగ్రి, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు, ఆవరణలో ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన కుమారుడు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధినేత తనకు ధైర్యం చెప్పారని, అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

దాడి సమయంలో తాను ఇంట్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాడిని కాదని ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన వారే ఈ అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, కానీ ఇలా దాడులకు పాల్పడడం నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదని అన్నారు.

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలకు తాను ప్రతి విమర్శలు చేశానని గుర్తు చేశారు. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు లేదని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంపై స్పందించాలని ఆయన కోరారు. 
Prasanna Kumar Reddy
YS Jagan Mohan Reddy
Nellore
Andhra Pradesh Politics
YSRCP
TDP
Vemireddy Prashanti Reddy
Pawan Kalyan
Attack
Political Violence

More Telugu News