Donald Trump: ఇండియాతో ట్రేడ్ డీల్‌కు దగ్గరలో ఉన్నాం: ట్రంప్

Close To Making Deal With India says Donald Trump
  • భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి దగ్గరలో ఉన్నామన్న ట్రంప్
  • పలు దేశాలపై కొత్తగా సుంకాలు విధిస్తున్న అమెరికా
  • అమెరికా వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తుల విషయంలో ప్రతిష్టంభన
  • తమ ఎగుమతులపై సుంకాల తగ్గింపు కోరుతున్న భారత్
  • జన్యుమార్పిడి పంటల విషయంలో ఇండియా తీవ్ర అభ్యంతరం
ఒకవైపు పలు కీలక దేశాలపై కొత్తగా సుంకాలు విధిస్తూ అమెరికా ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ఆయన మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూకే, చైనాతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నామని, ఇప్పుడు భారత్‌తో డీల్‌కు చేరువలో ఉన్నామని ట్రంప్‌ తెలిపారు.

బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలపై ఆగస్టు 1 నుంచి అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తూ అమెరికా లేఖలు పంపిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కొన్ని దేశాలకు ఎంత సుంకం చెల్లించాలో తెలియజేస్తూ లేఖలు పంపుతున్నామని, న్యాయమైన కారణాలుంటే కొన్ని సర్దుబాట్లు చేసే అవకాశం ఉందని ఆయన వివరించారు.

అయితే, అమెరికా, భారత్ మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో కొన్ని కీలక అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికాకు చెందిన డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లో ప్రవేశం కల్పించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జన్యుమార్పిడి (GM) పంటలను తమ మార్కెట్లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మరోవైపు, భారత్ తమ దేశంలో ఉపాధి కల్పనలో కీలకమైన వస్త్రాలు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలంటే, సుంకాల పరస్పర తగ్గింపు చాలా అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
Donald Trump
India trade deal
US India trade
trade agreement
US tariffs
Indian exports
agriculture products
dairy products
US Bangladesh trade

More Telugu News