Rahil Sheikh: మహిళపై ఎంఎన్ఎస్ నేత కుమారుడి దాష్టీకం... మహారాష్ట్రలో రాజకీయ దుమారం

Rahil Sheikh MNS Leaders Son Arrested for Misbehaving with Woman
  • మరాఠీ మహిళపై ఎంఎన్ఎస్ నేత కుమారుడు రాహిల్ షేఖ్ మద్యం మత్తులో దౌర్జన్యం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్ 
  • రాహిల్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావేద్ షేఖ్ కుమారుడు రాహిల్ షేఖ్ మద్యం మత్తులో అర్ధనగ్నంగా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించడం రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్రంలో మరాఠీయేతరులపై దాడులు కలకలం రేపుతున్న తరుణంలో, ఎంఎన్ఎస్ నేత కుమారుడు మద్యం మత్తులో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తన తండ్రి పలుకుబడి కలిగిన వ్యక్తి అని రాహిల్ మహిళను బెదిరించే ప్రయత్నం చేసిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి రాహిల్‌ను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాహిల్ వీడియోను శివసేన నేత సంజయ్ నిరుపమ్ రీ పోస్ట్ చేస్తూ ఎంఎన్ఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు. మరాఠీ సంస్కృతికి పరిరక్షకులమని చెప్పుకునే వారి నిజస్వరూపం ఇదేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ ఎంఎన్ఎస్ నేత కుమారుడు మరాఠీ మహిళను దుర్భాషలాడాడని, అంతేకాకుండా తన తండ్రి రాజకీయ పలుకుబడిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడని విమర్శించారు. వీళ్లు భాష పేరిట రౌడీయిజం తప్ప మరేమీ చేయట్లేదని, ఎంఎన్ఎస్ క్షేత్ర స్థాయి పరిస్థితి ఇది అని పేర్కొంటూ.. తమ ప్రభుత్వం మరాఠీకి వ్యతిరేకం కాదని, తాము భాషను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.

మరాఠీయేతరులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడికి దిగిన ఘటనలు ఇటీవల వెలుగుచూసిన నేపథ్యంలో ఈ వీడియో ఉదంతం మరింత కలకలం రేపుతోంది. అయితే, ఈ విషయంపై ఎంఎన్ఎస్ నేత అవినాశ్ జాదవ్ స్పందిస్తూ ఈ చర్యలను పార్టీ సమర్థించదని స్పష్టం చేస్తూ బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 
Rahil Sheikh
MNS
Maharashtra Navnirman Sena
Javed Sheikh
Maharashtra Politics
Marathi Culture
Viral Video
Sanjay Nirupam
Crime
Avinash Jadhav

More Telugu News