Babulal Oran: బీహార్ లో ఘోరం... చేతబడి అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య!

Five of Family Killed in Bihar Witchcraft Suspicion
  • బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో దారుణ ఘటన
  • చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఐదుగురి హత్య
  • ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టి, కాల్చేసిన గ్రామస్థులు
  • దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన బాలుడు
  • భయంతో ఊరు విడిచి పారిపోయిన గ్రామస్థులు
  • ఘటనపై నితీశ్ సర్కారుపై ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శలు
బీహార్‌లో మూఢనమ్మకం ఐదుగురిని బలితీసుకుంది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్థులు అత్యంత కిరాతకంగా కొట్టి, ఆపై దహనం చేశారు. ఈ దారుణ ఘటన పూర్ణియా జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ హత్యల తర్వాత నిందితులైన గ్రామస్థులు భయంతో ఊరు విడిచి పారిపోవడంతో గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది.

వివరాల్లోకి వెళితే... గ్రామంలో ఇటీవల కొందరు అనారోగ్యంతో మరణించారు. దీనికి బాబులాల్ ఓరాన్ కుటుంబం చేస్తున్న క్షుద్రపూజలే కారణమని గ్రామస్థులు అనుమానించారు. ఈ అనుమానం పెరిగిపోవడంతో ఆదివారం ఒక్కసారిగా ఆ కుటుంబంపై దాడికి దిగారు. బాబులాల్ ఓరాన్, సీతా దేవి, మంజీత్ ఓరాన్, రానియా దేవి, తప్తో మోస్మత్‌లను కర్రలతో కొట్టి చంపి, ఆ తర్వాత వారి మృతదేహాలకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సమీపంలోని చెరువు నుంచి దగ్ధమైన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘోర దాడి నుంచి ఆ కుటుంబానికి చెందిన ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామస్థులందరూ కలిసి తన కుటుంబ సభ్యులను చంపారని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు. అయితే, బాలుడు తీవ్ర భయాందోళనలో ఉండటంతో పోలీసులు ఇంకా పూర్తి వివరాలు సేకరించలేదని, అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిసింది. జనాలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై నకుల్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యల వెనుక మంత్రతంత్రాలు, క్షుద్రపూజలే కారణమని పూర్ణియా ఎస్పీ స్వీటీ సెహ్రావత్ ధృవీకరించారు. ప్రస్తుతం గ్రామంలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు గస్తీ కాస్తున్నారు.

ఈ ఘటనపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ స్పందిస్తూ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రెండు రోజుల క్రితం సివాన్‌లో ముగ్గురిని, ఇటీవల బక్సర్‌, భోజ్‌పూర్‌లలో ముగ్గురేసి చొప్పున చంపేశారు. రాష్ట్రంలో నేరగాళ్లు చురుగ్గా ఉన్నారు, ముఖ్యమంత్రి మాత్రం స్పృహలో లేరు" అని ఆయన ట్వీట్ చేశారు.
Babulal Oran
Bihar crime
witchcraft killing
Purnia district
superstition murder
tribal village
massacre India
Tejashwi Yadav
Nitish Kumar government
crime news

More Telugu News