స్వర్ణకారుల ఆత్మహత్యలపై కవిత ఆందోళన

  • స్వర్ణకారులపై వేధింపులకు కారణమవుతున్న సెక్షన్ 411ను సవరించాలని కవిత డిమాండ్
  • ఆత్మహత్యలు వద్దని స్వర్ణకారులకు హితవు
  • పోలీసులు దొంగలను వదిలేసి స్వర్ణకారులను పట్టుకుంటున్నారని మండిపాటు
రాష్ట్రంలో స్వర్ణకారులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులు, తప్పుడు కేసుల కారణంగానే వారు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అమాయకులైన స్వర్ణకారులపై వేధింపులకు కారణమవుతున్న సెక్షన్ 411 చట్టాన్ని తక్షణమే సవరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, "అసలు దొంగలను పట్టుకోవడం చేతకాని పోలీసులు, వారు అమ్మిన దొంగ సొత్తును కొన్నారనే నెపంతో స్వర్ణకారులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం" అని విమర్శించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె స్వర్ణకారులకు విజ్ఞప్తి చేశారు.

కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేక విశ్వకర్మలు, ఇతర చేతివృత్తుల వారు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక రుణాలు అందించి ఆదుకోవాలని సూచించారు. తాను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నానని గుర్తుచేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బీసీల తరఫున పోరాడే నాయకురాలిగా సెక్షన్ 411 సవరణ కోసం తన పోరాటం కొనసాగిస్తానని ఆమె హామీ ఇచ్చారు. చేతివృత్తుల వారిని ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆమె కోరారు. 


More Telugu News