నా భోజనంలో కనిపించింది బొద్దింక కాదు... వెంట్రుక: హోంమంత్రి అనిత క్లారిటీ

  • ఇటీవల పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్‌లో మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ
  • విద్యార్థినులతో కలిసి భోజనం
  • అనిత భోజనంలో బొద్దింక వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం
  • నేడు స్పష్టత ఇచ్చిన మంత్రి
  • సౌకర్యాలు లేవని వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్టు వెల్లడి
  • వైసీపీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతోందని అనిత విమర్శ
తాను పాయకరావుపేట హాస్టల్‌లో భోజనం చేస్తుండగా ప్లేట్‌లో బొద్దింక వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. అందులో ఉన్నది బొద్దింక కాదని, కేవలం ఒక చిన్న వెంట్రుక మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీల నుంచి పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, మంచిని కూడా చెడుగా చూపిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఇటీవల పాయకరావుపేటలోని బీసీ బాలికల కాలేజీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు మంత్రి అనిత తెలిపారు. ఆ సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా తన ప్లేట్‌లో ఒక వెంట్రుక కనిపించిందని వివరించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, తనిఖీలో భాగంగా ఆ హాస్టల్‌లో సరైన మెనూ పాటించడం లేదని, వార్డెన్, సెక్యూరిటీ కూడా అందుబాటులో లేరని గుర్తించామన్నారు. ఈ కారణాలతో వార్డెన్‌ను సస్పెండ్ చేశామని, రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించినట్టు ఆమె పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా హాస్టళ్లను సందర్శించారా? అని ఆమె ప్రశ్నించారు. నిన్న శ్రీశైలం ప్రసాదంలో బొద్దింక అంటూ, ఈరోజు తన భోజనంలో బొద్దింక అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాము చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంటే, వైసీపీ నేతలకు మాత్రం అధికార దాహం తప్ప మానవత్వం లేదని అనిత దుయ్యబట్టారు.


More Telugu News