Danam Nagender: దానం నాగేందర్ ఢిల్లీ పయనం.. మంత్రి పదవిపైనే గురి!

Danam Nagender Delhi Trip Focus on Minister Post
  • ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశం
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా
  • సీఎం సవాల్‌ను స్వీకరించాలంటూ కేటీఆర్‌కు హితవు
తెలంగాణలో కేబినెట్ విస్తరణపై చర్చ ఊపందుకున్న వేళ, కాంగ్రెస్ సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి పదవిపై గట్టిగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీ అధిష్టానాన్ని కలిసి కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని కోరనున్నట్లు సమాచారం. ఈ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

ఢిల్లీ పర్యటనకు ముందు, ఈ ఉదయం గాంధీభవన్‌లో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి వస్తుందా? లేదా? అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను మాజీ మంత్రి కేటీఆర్ స్వీకరించాలని, దానిని వక్రీకరించడం సరికాదని హితవు పలికారు.

ఈ సందర్భంగా దానం బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు తమ అంతర్గత సమస్యలను ముందుగా పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు. ఎందరో బీసీ నేతలు అధ్యక్ష పదవిని ఆశించినా, దానిని ఓసీ వర్గానికి కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి, తాను గెలిచిన సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డుకు కనీసం కార్యాలయం కూడా లేదని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల మూడు పదవులను భర్తీ చేసిన అధిష్టానం, మిగిలిన వాటి భర్తీపై కసరత్తు చేస్తోంది. ఈసారి బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా వర్గాల నేతలు కోరుతున్న నేపథ్యంలో, దానం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 
Danam Nagender
Telangana cabinet expansion
Khairatabad MLA
Revanth Reddy
KTR challenge
Jubilee Hills byelection
Telangana Congress
BC leaders
Kishan Reddy
Pasupu Board

More Telugu News