Dulquer Salmaan: 'లక్కీ భాస్కర్' కు సీక్వెల్ ఉందట!

Lucky Baskhar Sequel Confirmed by Director Venky Atluri
  • లక్కీ భాస్కర్ సీక్వెల్ పై స్పందించిన దర్శకుడు వెంకీ అట్లూరి
  • సీక్వెల్ చేయాలనే డిమాండ్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయన్న వెంకీ
  • కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది, కానీ సమయం పడుతుందన్న వెంకీ
దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రం 'లక్కీ భాస్కర్' గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'లక్కీ భాస్కర్' ఒక అరుదైన స్క్రిప్ట్ అని, దానిని టచ్ చేయాలంటే చాలా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

తాను 'లక్కీ భాస్కర్' మూవీ చిత్రీకరణ సమయంలోనే దానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నానని, అయితే ప్రేక్షకుల ఆదరణను బట్టి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నానని చెప్పారు. తాను అనుకున్నట్లే 'లక్కీ భాస్కర్' విజయం సాధించిందని, ఇప్పుడు దానికి సీక్వెల్ చేయాలనే డిమాండ్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయని తెలిపారు.

ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, అయితే దానికి కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి వెంకీ అట్లూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, 'లక్కీ భాస్కర్' విజయం తర్వాత సూర్య హీరోగా వెంకీ కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. 
Dulquer Salmaan
Lucky Baskhar
Venky Atluri
Lucky Baskhar sequel
Telugu movies
Tollywood
Movie sequel
Surya movie
Film industry
Entertainment news

More Telugu News