సుపరిపాలనలో తొలి అడుగు... కూటమి ప్రభుత్వ ఘనతలను ప్రజలకు వివరించిన మంత్రి ఆనం

  • ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన
  • సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకం
  • ప్రభుత్వ తొలి ఏడాది సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తున్న మంత్రి
  • సూపర్ సిక్స్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
  • అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి హామీల అమలు త్వరలోనేనని వెల్లడి
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని, త్వరలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి వంటి కీలక హామీలను కూడా నెరవేరుస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే తన ఏకైక లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆనం తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదివారం సంగం మండలం కోలగట్ల గ్రామంలో ఆయన పర్యటించి, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు. తమ ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను, ఆయా కుటుంబాలు పొందిన లబ్ధిని వారికి వివరించారు. సుపరిపాలన అంటే ఏమిటో తమ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందని అన్నారు.

మంత్రి నిన్న కుప్పూరుపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంకు పార్టీ శ్రేణులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు మంత్రి తెలిపారు.


More Telugu News