స్నేహితుల హేళన.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

  • 'చదువులో వెనుకబడ్డావంటూ' హేళన చేయడంతో మనస్తాపం
  • జగిత్యాల జిల్లాలో పురుగుల మందు తాగిన యువతి
  • కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఇద్దరు స్నేహితురాళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు
స్నేహితురాళ్లు అన్న మాటలకు తీవ్రంగా మనస్తాపం చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తోటి స్నేహితులే ఆమె పాలిట శత్రువులుగా మారారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21), హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఆమె స్నేహితురాళ్లయిన వైష్ణవి, సంజన.. "చదువులో వెనుకబడిపోయావు" అంటూ నిత్యను అందరి ముందు అవమానించారు.

ఈ ఘటనతో తీవ్రంగా నొచ్చుకున్న నిత్య, హైదరాబాద్ నుంచి తన స్వగ్రామానికి తిరిగి వచ్చేసింది. తీవ్ర ఆవేదనతో ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగేసింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి శుక్రవారం ఆమె మరణించింది.

తమ కుమార్తె మృతికి స్నేహితురాళ్లే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు తిరుపతి, సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా వైష్ణవి, సంజనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. నిత్య మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


More Telugu News