భారత్ దెబ్బకు చైనాపై నమ్మకం పోయిందా? అగ్రరాజ్యం బాట పట్టిన పాక్

  • అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్
  • కొద్ది రోజుల క్రితమే అమెరికాకు వెళ్లి వచ్చిన పాక్ ఆర్మీ చీఫ్
  • చైనా ఆయుధ వ్యవస్థలపై సన్నగిల్లిన నమ్మకమే కారణం
  • 'ఆపరేషన్ సిందూర్' సమయంలో విఫలమైన చైనా రాడార్లు
  • అమెరికా నుంచి ఎఫ్-16 జెట్లు, క్షిపణుల కొనుగోలుకు ప్రయత్నాలు
  • అగ్రరాజ్యంతో రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యం
పాకిస్థాన్ ఉన్నత సైనికాధికారులు వరుసగా అమెరికా పర్యటనలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ అమెరికాలో పర్యటించి రాగా, ప్రస్తుతం పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు అగ్రరాజ్యం బాట పట్టారు. చైనా నుంచి కొనుగోలు చేసిన ఆయుధ వ్యవస్థల పనితీరుపై తీవ్ర అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో అమెరికాతో రక్షణ సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకునేందుకే ఈ పర్యటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల 'ఆపరేషన్ సిందూర్' పేరిట భారత్ ప్రయోగించిన క్షిపణులను గుర్తించడంలో గానీ, అడ్డుకోవడంలో గానీ పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. చైనా నుంచి సేకరించిన హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వంటి వ్యవస్థలు భారత క్షిపణుల ముందు తేలిపోయాయి. ఈ పరిణామంతో, ఇప్పటివరకు డ్రాగన్ దేశపు ఆయుధాలపైనే ప్రధానంగా ఆధారపడిన పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనా అందించిన సైనిక పరిజ్ఞానం విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ నేపథ్యంలోనే పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ తన పర్యటనలో భాగంగా అమెరికా సైనిక ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. చైనా ఆయుధాలపై నమ్మకం కోల్పోయిన పాకిస్థాన్, ఇప్పుడు తన వైమానిక దళాన్ని అమెరికా ఆయుధాలతో ఆధునీకరించాలని చూస్తోంది.

ముఖ్యంగా ఎఫ్-16 యుద్ధ విమానాలు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎయిమ్-7 స్పారో వంటి క్షిపణులను కొనుగోలు చేయాలని పాక్ భావిస్తున్నట్టు సమాచారం. గత దశాబ్ద కాలంగా చైనాతో పాకిస్థాన్ పెంచుకున్న స్నేహం పట్ల అసంతృప్తితో ఉన్న అమెరికాతో సంబంధాలను చక్కదిద్దుకొని, రక్షణ కొనుగోళ్లు పెంచుకోవడమే ఈ పర్యటనల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.


More Telugu News