చికాగోలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి, 14 మందికి గాయాలు

  • అమెరికాలోని చికాగోలో దారుణమైన కాల్పుల ఘటన
  • కారులో వచ్చిన దుండగులు గుంపుపై కాల్పులకు తెగబడ్డారు
  • ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి 
  • మరో 14 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చికాగో నగరంలోని రివర్ నార్త్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన డ్రైవ్-బై షూటింగ్‌లో నలుగురు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు గురువారం వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రివర్ నార్త్ ఏరియాలోని ఒక రెస్టారెంట్ వెలుపల కొందరు గుంపుగా నిలబడి ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం, అంతకుముందే ఆ రెస్టారెంట్‌లో ఓ ర్యాపర్ తన ఆల్బమ్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయట ఉన్న వారి వద్దకు వేగంగా ఓ కారు వచ్చింది. అందులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా గుంపుపై కాల్పులకు తెగబడి, వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ కాల్పుల ఘటనలో గాయపడిన పలువురికి తమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని నార్త్‌వెస్టర్న్ మెడిసిన్ ప్రతినిధి క్రిస్ కింగ్ తెలిపారు. అయితే, బాధితుల సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


More Telugu News