Delta Airlines: గాల్లో ఉండగానే విమానం రెక్క భాగం ఊడిపడింది.. అమెరికాలో తప్పిన ప్రమాదం

Delta Airlines Plane Wing Falls Off Mid Air in US
  • అమెరికాలో డెల్టా విమానానికి తప్పిన పెను ప్రమాదం
  • ల్యాండింగ్ సమయంలో ఊడిపడ్డ రెక్కలోని భాగం
  • 109 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితం
  • నార్త్ కరోలినాలో రహదారిపై పడిన విడిభాగం
  • ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్
అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. 115 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం ల్యాండ్ అవుతుండగా దాని రెక్కలోని ఒక భాగం ఊడి కింద రోడ్డుపై పడింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ధ్రవీకరించింది.

మంగళవారం రాత్రి డెల్టా ఫ్లైట్ 3247 బోయింగ్ 737-900 విమానం అట్లాంటా నుంచి నార్త్ కరోలినాలోని రెలీ-డర్హం విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో 109 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణం సాఫీగానే సాగినా, రెలీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. విమానం ఎడమ రెక్క వెనుక భాగంలో ఉండే 'ఫ్లాప్'కు సంబంధించిన ఒక విడిభాగం ఊడి కిందపడింది. అయినప్పటికీ పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ల్యాండింగ్ తర్వాత విమానాన్ని తనిఖీ చేయగా రెక్క భాగం ఒకటి కనిపించకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలింపు చేపట్టగా ఆ విడిభాగం విమానాశ్రయ సమీపంలోని ఒక రహదారిపై లభ్యమైనట్లు ఎఫ్‌ఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని డెల్టా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాటి వేగాన్ని, గమనాన్ని నియంత్రించడానికి ఫ్లాప్స్ అత్యంత కీలకంగా పనిచేస్తాయి. ఇటీవల బోయింగ్ విమానాల్లో భద్రతా లోపాలు తరచుగా బయటపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Delta Airlines
Delta Airlines flight
North Carolina
Raleigh Durham Airport
FAA investigation

More Telugu News