job offer cancelled: రూ.22 లక్షల జాబ్ ఆఫర్ క్యాన్సిల్.. సోషల్ మీడియా కామెంట్లే కారణం!

- ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రతిభకు స్టార్టప్ ఓనర్ ఫిదా.. భారీ ప్యాకేజీతో జాబ్ ఆఫర్
- బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ లో అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాల పరిశీలన
- మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు గుర్తించి జాబ్ ఆఫర్ రద్దు
- ప్రతిభ కంటే విలువలే ముఖ్యమని స్టార్టప్ ఓనర్ పోస్ట్
కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదని, సత్ప్రవర్తన, విలువలు కూడా అంతే ముఖ్యమని ఓ భారతీయ స్టార్టప్ యజమాని పేర్కొన్నారు. ఇతర మతాలను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు, ఏడాదికి రూ.22 లక్షల ప్యాకేజీతో ఎంపిక చేసిన అభ్యర్థి నియామకాన్ని రద్దు చేశారు. అందుకు గల కారణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట చర్చకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. 'జాబీ' అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అహ్మద్ భాటి ఇటీవల తమ కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసినట్లు లింక్డ్‌ఇన్‌లో వెల్లడించారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రతిభకు ముగ్ధుడయ్యానని చెప్పారు. తమ బడ్జెట్ కంటే ఎక్కువ జీతం ఇచ్చేందుకు సిద్ధపడ్డామని ఆయన తెలిపారు. అయితే, తుది దశ బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో భాగంగా అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, కొన్ని వర్గాలను కించపరిచేలా అభ్యర్థి పెట్టిన పాత కామెంట్లు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు.
"ఒక వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా కావొచ్చు. ప్రతిభతో పాటు మాకు గౌరవం, ప్రాథమిక విలువలు కూడా అంతే ముఖ్యం. ప్రతిభ మిమ్మల్ని కంపెనీలోకి అడుగుపెట్టేలా చేస్తుంది. కానీ, మీ విలువలు మాత్రమే మీరు ఇక్కడ కొనసాగాలా వద్దా అని నిర్ణయిస్తాయి" అని భాటి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆఫర్ రద్దు చేస్తూ పంపిన లేఖ స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. "మీరు లింక్డ్‌ఇన్‌లో పెట్టిన కొన్ని పబ్లిక్ కామెంట్లు కొన్ని వర్గాల మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ కారణంగా మీకు ఇచ్చిన ఉద్యోగ నియామకపు ఆఫర్ ను రద్దు చేస్తున్నాం" అని ఆ లేఖలో భాటి స్పష్టం చేశారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫౌండర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, కంపెనీ సంస్కృతికి విలువలు చాలా అవసరమని అంటుండగా, మరికొందరు ఇది 'క్యాన్సిల్ కల్చర్' అని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఉద్యోగ ఆఫర్‌ను రద్దు చేయడం నాయకత్వపు అపరిపక్వతకు నిదర్శనమని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ ఉదంతం, వృత్తి జీవితంపై సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉంటుందో మరోసారి గుర్తు చేసింది.