Disney Cruise: కూతురు కోసం సముద్రంలోకి దూకిన తండ్రి.. వీడియో ఇదిగో!

Father saves daughter in Disney Cruise accident
  • బహామాస్ నుంచి ఫ్లోరిడా వెలుతున్న నౌకలో ప్రమాదం
  • నౌక పైనుంచి పడిపోయిన చిన్నారి
  • వెంటనే నీళ్లలోకి దూకి కూతురిని కాపాడిన తండ్రి
  • దాదాపు 20 నిమిషాల పాటు పాపను పట్టుకున్న వైనం
  • వెంటనే స్పందించి ఇద్దరినీ రక్షించిన నౌక సిబ్బంది
డిస్నీ క్రూయిజ్ నౌకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. నౌకలోని నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నీళ్లలో పడిపోగా, బిడ్డను కాపాడుకోవడానికి ఆమె తండ్రి సముద్రంలోకి దూకారు. ఆయన సాహసంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడగా, ఆ తండ్రి ఇప్పుడు రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. జూన్ 29న బహామాస్ నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌కు తిరిగి వస్తున్న 'డిస్నీ డ్రీమ్' నౌకలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుమార్తె నీళ్లలో పడగానే, ఆమె తండ్రి కూడా వెనుకే దూకారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన తన కుమార్తెను నీటిపై తేలి ఉండేలా పట్టుకొని కాపాడారు. ఇంతలో నౌక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. నిమిషాల వ్యవధిలోనే తండ్రీకూతుళ్లు ఇద్దరినీ సురక్షితంగా నౌకపైకి చేర్చారు.

"మా సిబ్బంది అద్భుతమైన నైపుణ్యంతో, వేగంగా స్పందించి వారిద్దరినీ సురక్షితంగా కాపాడారు. మా ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం" అని డిస్నీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి ప్రయాణికులు ఆ తండ్రిని హీరోగా కొనియాడారు. "ఆయన నిజమైన హీరో. తన బిడ్డను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించారు" అంటూ పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తండ్రీకూతుళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
Disney Cruise
Father daughter
Cruise accident
Bahamas
Fort Lauderdale
Cruise ship
Child safety
Heroic rescue
Sea rescue

More Telugu News