Roll cloud: ఆకాశంలో సునామీ.. పోర్చుగల్ బీచ్‌లో భయపెట్టిన వింత మేఘం.. వీడియో ఇదిగో!

Portugal Beach Hit by Rare Roll Cloud Formation
  • అరుదైన 'రోల్ క్లౌడ్'.. ఆకాశంలో అద్భుతం చూసి జనం ఆశ్చర్యం!
  • భారీ అలల రూపంలో తీరం వైపు దూసుకొచ్చిన 'రోల్ క్లౌడ్'.. భయంతో పర్యాటకుల పరుగులు
  • తీవ్రమైన వడగాల్పుల వల్లే ఈ దృగ్విషయమన్న నిపుణులు
పోర్చుగల్‌లోని ఓ బీచ్‌లో ఆకాశంలో అద్భుతమైన, అదే సమయంలో భయం కలిగించే దృశ్యం కనిపించింది. సముద్రంలో వచ్చే భారీ కెరటంలా ఓ పెద్ద మేఘం తీరం వైపు దూసుకురావడంతో అక్కడున్న పర్యాటకులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈ అరుదైన వాతావరణ దృగ్విషయాన్ని 'రోల్ క్లౌడ్' అంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం పోర్చుగల్‌లోని పోవోవా డో వర్జిమ్ బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో పైపు ఆకారంలో ఉన్న ఓ భారీ మేఘం వేగంగా తీరం వైపు కదులుతూ వచ్చింది. అది సమీపిస్తున్న కొద్దీ బలమైన గాలులు వీయడంతో, బీచ్‌లోని గొడుగులు, ఇతర వస్తువులు ఎగిరిపోయాయి. ఊహించని ఈ పరిణామానికి పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. మరికొందరు భయంతో పరుగులు తీశారు.

వాతావరణ నిపుణుల ప్రకారం.. ఇది 'రోల్ క్లౌడ్' అనే చాలా అరుదైన మేఘం. వేడి, చల్లని గాలులు ఒకదానికొకటి కలిసినప్పుడు ఇలాంటివి ఏర్పడతాయి. ఇవి చూడటానికి సునామీ అలల్లా కనిపించినా, వీటికి సునామీలకు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేశారు. ఇవి భూమికి సమాంతరంగా కదులుతూ, దొర్లుతున్నట్లు కనిపిస్తాయి.

ప్రస్తుతం పోర్చుగల్ తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతోంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణంలో అస్థిరత నెలకొంది. దీని కారణంగానే సోమవారం ఇలాంటి వింత మేఘాలు ఏర్పడినట్లు 'యూరోన్యూస్' కథనం పేర్కొంది. మరోవైపు, పెరుగుతున్న ఎండల కారణంగా అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
Roll cloud
Portugal
Portugal beach
Povoa de Varzim
weather phenomenon
unusual cloud formation
heat wave Portugal
national disaster management authority
fire risk

More Telugu News