మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీతో వ‌స్తున్న అల్లరి న‌రేశ్‌.. ఆస‌క్తిక‌రంగా ఫ‌స్ట్ లుక్

  • పుట్టినరోజు సందర్భంగా అల్లరి నరేశ్‌ కొత్త సినిమా ప్రకటన
  • అల్ల‌రోడి 63వ చిత్రానికి 'ఆల్కహాల్' అనే టైటిల్ ఖరారు
  • విడుదలైన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్
  • మెహర్ తేజ్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం
  • హీరోయిన్‌గా రుహాని శర్మ.. సంగీత దర్శకుడిగా గిబ్రాన్
ఒకప్పుడు తన కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు అల్లరి నరేశ్‌ ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన తన 63వ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఆల్కహాల్' అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో అల్లరి నరేశ్‌ పూర్తిగా మద్యానికి బానిసైన వ్యక్తిగా, గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తనదైన నటనతో కామెడీనే కాకుండా భావోద్వేగాలను కూడా అద్భుతంగా పండించగల నరేశ్‌.. ఈ చిత్రంలో మరో శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమవుతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్‌కు జోడీగా నటి రుహాని శర్మ నటిస్తుండగా, విలక్షణ సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా, నరేశ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.



More Telugu News