తిరుమలలో టీటీడీ ఉద్యోగికి పాముకాటు

  • కల్యాణ వేదిక వద్ద నాగుపామును పడుతుండగా ఘటన
  • ఉద్యోగి భాస్కరనాయుడికి ఐసీయూలో చికిత్స
  • ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడి
  • గతంలోనూ ఓసారి పాముకాటుకు గురైన ఉద్యోగి
టీటీడీ అటవీశాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న భాస్కరనాయుడు (68) మరోసారి పాముకాటుకు గురయ్యారు. పాములను పట్టడంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన, శ‌నివారం ఓ నాగుపామును పట్టుకునే ప్రయత్నంలో దాని కాటుకు గుర‌య్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... శ‌నివారం మధ్యాహ్నం తిరుమలలోని కల్యాణ వేదిక సమీపంలో ఓ భారీ నాగుపాము సంచరిస్తోందని స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే స్పందించిన భాస్కరనాయుడు అక్కడికి చేరుకున్నారు. పామును పట్టుకుంటుండ‌గా కాటేసింది. ప్రమాదాన్ని గమనించిన తోటి ఉద్యోగులు హుటాహుటిన ఆయ‌న‌ను తిరుమలలోని టీటీడీ అశ్విని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ అపోలో అత్యవసర విభాగంలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కరకంబాడీ మార్గంలోని అమరా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, భాస్కరనాయుడు పాముకాటుకు గురవడం ఇది రెండోసారి. గతంలో ఓసారి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అర్ధరాత్రి సమయంలో ఓ పామును పట్టుకునేందుకు ప్రయత్నించి, తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో టీటీడీ యాజమాన్యమే ఆయన వైద్య ఖర్చులన్నీ భరించి మెరుగైన చికిత్స అందించింది. మళ్లీ ఇప్పుడు అదే తరహా ఘటన జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు, సహోద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


More Telugu News