Low Blood Pressure: లోబీపీని తక్కువ అంచనా వేయొద్దు.. ఈ లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త!

Low BP Dont Underestimate Symptoms and Precautions
  • 90/60 కంటే తక్కువగా ఉంటే లోబీపీగా నిర్ధారణ
  • త‌ల‌ తిర‌గ‌డం, నీరసం, కళ్లు బైర్లు కమ్మడం దీని ముఖ్య లక్షణాలు
  • డీహైడ్రేషన్, పోషకాహార లోపం ప్రధాన కారణాలు
  • నియంత్రణకు ఆహారంలో ఉప్పు, నీరు, విటమిన్లు చాలా అవసరం
  • వైద్యులను సంప్రదించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం
అధిక రక్తపోటు (హైబీపీ) గురించిన అవగాహన చాలా మందిలో ఉంటుంది. కానీ, తక్కువ రక్తపోటు (లోబీపీ లేదా హైపోటెన్షన్)ను చాలామంది ఒక సాధారణ నీరసంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం హైబీపీ ఎంత ప్రమాదకరమో, లోబీపీ కూడా అంతే తీవ్రమైన సమస్య. దీన్ని సరైన సమయంలో గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

లోబీపీ అంటే ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
సాధారణంగా ఒక వ్యక్తి రక్తపోటు 120/80గా ఉండాలి. అలా కాకుండా రక్తపోటు రీడింగ్ 90/60 కన్నా తక్కువగా నమోదైతే ఆ పరిస్థితిని లోబీపీగా పరిగణిస్తారు. లోబీపీ ఉన్నవారిలో తరచుగా కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. అకస్మాత్తుగా తల తిరగడం, విపరీతమైన నీరసం, వికారంగా అనిపించడం, కళ్లు బైర్లు కమ్మడం, ఏకాగ్రత లోపించడం వంటివి ప్రధానమైనవి. కొందరిలో చర్మం చల్లగా, పాలిపోయినట్టు కనిపించడం, గుండె వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకోవడం, ఆందోళన వంటి లక్షణాలు కూడా ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

లోబీపీకి కారణాలేమిటి?
శరీరంలో లోబీపీ ఏర్పడటానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. వాటిలో ముఖ్యమైంది డీహైడ్రేషన్. అంటే శరీరానికి అవసరమైనంత నీరు అందకపోవడం. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అధికంగా రక్తస్రావం కావడం, గుండె సంబంధిత సమస్యలు, థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, పోషకాహార లోపం వంటివి లోబీపీకి దారితీస్తాయి. గర్భిణులలో కూడా ఈ సమస్య కనిపించే అవకాశం ఉంది. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా రక్తపోటు పడిపోవచ్చు.

ఆహార నియమాలతో అదుపు సాధ్యమే
లోబీపీ సమస్య ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మందులు వాడటంతో పాటు జీవనశైలిలో ముఖ్యంగా ఆహారంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడం చాలా అవసరం.

నీరు, ద్రవపదార్థాలు: లోబీపీకి డీహైడ్రేషన్ ప్రధాన కారణం కాబట్టి రోజూ కనీసం 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. నీటితో పాటు కొబ్బరినీళ్లు, దానిమ్మ, నారింజ వంటి పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి.

ఉప్పు వాడకం: ఉప్పు ఎక్కువగా తింటే ప్రమాదమని భావించి పూర్తిగా మానేయడం కూడా సరికాదు. శరీరంలో సోడియం స్థాయిలు తగ్గినా లోబీపీ వస్తుంది. రోజుకు ఒక టీస్పూన్ (సుమారు 5 గ్రాములు) మోతాదులో ఉప్పు అవసరం.

పోషకాహారం: విటమిన్ బి9 (ఫోలేట్), బి12 లోపం కూడా లోబీపీకి కారణమవుతుంది. అందువల్ల పాలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, బ్రకోలీ, పప్పుధాన్యాలు, నట్స్, మటన్ లివర్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చికెన్, పనీర్ వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇతర జాగ్రత్తలు: లోబీపీ ఉన్నవారు ఉదయం అల్పాహారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మానకూడదు. పరిమితంగా టీ, కాఫీ తాగడం వల్ల కెఫీన్ రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది. అయితే రోజుకు రెండు, మూడు కప్పులకు మించకూడదు. అలాగే రాత్రంతా నానబెట్టిన కిస్‌మిస్‌లు, బాదం పప్పులు తినడం, రోజూ ఒక కప్పు బీట్‌రూట్ రసం తాగడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
Low Blood Pressure
Hypotension
Low BP Symptoms
Dehydration
Heart Problems
Diet for Low BP
Electrolytes
Vitamin B12 Deficiency
Home Remedies for Low BP
Low Blood Pressure Causes

More Telugu News