Green Card: ఆ తప్పు చేస్తే గ్రీన్‌కార్డు రద్దు తప్పదు: అమెరికా హెచ్చరిక

USCIS Warns Green Card Holders Violations Lead to Revocation
  • వలసదారులకు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం తీవ్ర హెచ్చరిక
  • చట్టాలను ఉల్లంఘిస్తే గ్రీన్‌కార్డు, వీసా రద్దు చేస్తామని స్పష్టీకరణ
  • ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తే కఠిన చర్యలు
  • అమెరికాలో శాశ్వత నివాసం హక్కు కాదు, సౌలభ్యం మాత్రమేనని వెల్లడి
  • హింసను ప్రేరేపించినా, ప్రోత్సహించినా అనర్హులవుతారని ప్రకటన
అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు, ముఖ్యంగా గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఆ దేశ పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశ చట్టాలను, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని, వారి గ్రీన్‌కార్డులు, వీసాలు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్‌సీఐఎస్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

అమెరికా చట్టాలను ఉల్లంఘించడం, ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం లేదా హింసను ప్రోత్సహించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడితే, వారి శాశ్వత నివాస హోదాను తక్షణమే రద్దు చేస్తామని తేల్చిచెప్పింది. గ్రీన్‌కార్డు ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడం అనేది ఒక హక్కు కాదని, అది కేవలం ప్రభుత్వం కల్పించే షరతులతో కూడిన సౌలభ్యం మాత్రమేనని యూఎస్‌సీఐఎస్ తన ప్రకటనలో పేర్కొంది.

“అమెరికాకు రావడం, వీసా లేదా గ్రీన్‌కార్డు పొందడం ఒక గౌరవం. మీరు మా చట్టాలను, విలువలను తప్పనిసరిగా గౌరవించాలి. మీరు హింసకు సహకరించినా, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినా లేదా ఇతరులను అందుకు పురికొల్పినా, మీరు అమెరికాలో నివసించే అర్హతను కోల్పోతారు” అని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.

ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా సుమారు 1.8 కోట్ల మంది గ్రీన్‌కార్డు పొంది శాశ్వత నివాసం ఉంటున్నారు. ట్రంప్ మొద‌టి ద‌ఫా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన ‘క్యాచ్ అండ్ రివోక్’ (పట్టుకోవడం - రద్దు చేయడం) విధానాన్ని ఇప్పుడు కూడా అమ‌లు చేస్తున్నార‌ని ఈ హెచ్చరికల ద్వారా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వలసదారులు అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండాలని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. 
Green Card
USCIS
United States
Immigration
Visa
Permanent Residence
Terrorism
US Laws
Catch and Revoke
Immigration Rules

More Telugu News