Macha Biryani: 'మచా బిర్యానీ'... ఇదేం వింత ప్రయోగం బాబోయ్!

Macha Biryani Viral Video Sparks Outrage
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'మచా బిర్యానీ'
  • గ్రీన్ టీ పౌడర్‌తో ఆకుపచ్చ రంగులో బిర్యానీ తయారీ
  • హీనా కౌసర్ రాద్ అనే కలినరీ ఆర్టిస్ట్ వింత ప్రయోగం
  • బిర్యానీని ఇలా చేయొద్దంటూ నెటిజన్ల తీవ్ర వ్యతిరేకత
  • ఇదేం ఖర్మరా బాబూ అంటూ ఫన్నీ కామెంట్లతో వెల్లువెత్తిన స్పందన
  • ఫుడ్ ఫ్యూజన్ ట్రెండ్‌పై మరోసారి పెద్ద చర్చ
సోషల్ మీడియా ట్రెండింగ్ కోసం కొందరు చేసే వింత ప్రయోగాలు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. ముఖ్యంగా ఆహార ప్రియులు ఎంతో ఇష్టపడే వంటకాలపై చేసే ప్రయోగాలు తీవ్ర చర్చకు దారితీస్తాయి. తాజాగా అలాంటి ఓ ఘటనే నెట్టింట వైరల్ అవుతోంది. అందరికీ ఇష్టమైన బిర్యానీపై ఓ క్యులినరీ ఆర్టిస్ట్ చేసిన ప్రయోగం చూసి బిర్యానీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ ‘మచా బిర్యానీ’ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

జపాన్‌కు చెందిన గ్రీన్ టీ పౌడర్ 'మచా' ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. టీ, కాఫీలకే పరిమితం కాకుండా డెజర్ట్‌లు, ఇతర వంటకాల్లో కూడా దీన్ని విరివిగా వాడుతున్నారు. ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ, హీనా కౌసర్ రాద్ అనే క్యులినరీ ఆర్టిస్ట్ ఏకంగా బిర్యానీలోనే మచాను కలిపి ఓ కొత్త వంటకాన్ని సృష్టించారు. 'మచా బిర్యానీ' పేరుతో దీని వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, ఒక పెద్ద పాత్ర నిండా ఆకుపచ్చ రంగులో ఉన్న అన్నాన్ని ఆమె చూపిస్తుండటం కనిపిస్తుంది.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అది కాస్తా వైరల్‌గా మారింది. బిర్యానీని ఆకుపచ్చ రంగులో చూడగానే నెటిజన్లు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులు షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన వంటకాన్ని ఇలా నాశనం చేయొద్దంటూ కామెంట్ల వర్షం కురిపించారు. చాలామంది ఈ వింత ప్రయోగంపై తీవ్ర వ్యతిరేకత చూపగా, మరికొందరు ఫన్నీ మీమ్స్, జోకులతో స్పందించారు.

ఈ వీడియో కింద కామెంట్ల సెక్షన్‌లో నెటిజన్ల స్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. "అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది?" అని ఒకరు ప్రశ్నించగా, "ఈ రోజుకి ఇంటర్నెట్ చాలు బాబోయ్" అంటూ మరొకరు కామెంట్ చేశారు. "దయచేసి బిర్యానీతో ఇలాంటి పనులు చేయొద్దు" అని ఒక యూజర్ వేడుకోగా, "ఇది చూసి ఎక్కడో ఓ హైదరాబాదీ సొమ్మసిల్లి పడిపోయి ఉంటాడు" అంటూ మరో వ్యక్తి చేసిన కామెంట్ తెగ వైరల్ అయింది. "ఇది ఇటాలియన్ బిర్యానీలా ఉంది", "తర్వాతి ప్రయోగం దుబాయ్ చాక్లెట్ బిర్యానీ ఏమో" అంటూ నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వింత ఫుడ్ ఫ్యూజన్ ప్రయోగం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.
Macha Biryani
Heena Kausar Raad
Biryani
Food Experiment
Viral Video
Green Tea Powder
Hyderabadi Biryani
Food Fusion
Social Media Trend

More Telugu News