నేటి నుంచే వారికి జులై నెల రేషన్ పంపిణీ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

  • వృద్ధులు, దివ్యాంగులైన రేషన్ కార్డుదారులకు నేటి నుంచి రేషన్ డోర్ డెలివరీ
  • ఈ నెలలో ఎదురైన సమస్యల దృష్ట్యా జులై నెల కోటాను ముందుగానే డోర్ డెలివరీకి చర్యలు  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులకు ముందుగానే రేషన్ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. జులై నెలకు సంబంధించిన రేషన్‌ను వారికి నాలుగు రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వృద్ధులు, దివ్యాంగులకు నేటి (గురువారం) నుంచే డీలర్లు ఇళ్ల వద్దనే రేషన్ పంపిణీ చేయనున్నారు.

జూన్ నెల నుంచే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించినా, సమాచార లోపం కారణంగా ఈ నెల మొదటి వారంలో చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు చౌక ధరల దుకాణాల (రేషన్ షాపులు) వద్దకు వెళ్లి రేషన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎదురైన సమస్యల దృష్ట్యా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులు, డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది.

డోర్ డెలివరీ విధానం పర్యవేక్షణకు గానూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. జులై నెల రేషన్ పంపిణీ కార్డుదారులందరికీ జులై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్ షాపులో పంపిణీ చేయనుండగా, ఈ రోజు నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఆయా రేషన్ షాపు డీలర్లు ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ పంపిణీ చేయనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే చౌక ధరల దుకాణాలకు నిత్యావసర వస్తువుల సరఫరా జరిగింది. 


More Telugu News