Shubman Gill: హెడింగ్లీ టెస్టులో భారత్ ఓటమికి ఐదు కారణాలు.. అవి ఇవే!

Indias Headingley Test Loss Shubman Gill Led Team Falters
  • గిల్ కెప్టెన్సీలో తొలి టెస్టులోనే టీమిండియాకు షాక్ 
  • ఆరంభం అదిరినా.. భారత్ చేజారిన మ్యాచ్
  • బ్యాటింగ్ వైఫల్యం, క్యాచ్‌ల డ్రాప్‌లో ఓటమికి ప్రధాన కారణాలు!
  • బ్యాటర్లు మెరిసినా.. ఫీల్డింగ్, బౌలింగ్ దెబ్బ
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శుభమన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఓటమి పాలైంది. ఆరంభం అదిరినప్పటికీ ఆ తర్వాత పట్టు సడలించిన భారత జట్టు అందుకు మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్ లైనప్ రెండుసార్లు కుప్పకూలడం, కీలకమైన క్యాచ్‌లను జారవిడవడం, బౌలింగ్ విభాగంలో వైవిధ్యం కొరవడటం వంటి అంశాలు భారత్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. ఈ లోపాలను చక్కగా సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

భారత టెస్టు క్రికెట్‌లో మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేని యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించడంతో భారత్ 471 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించినట్లేనని అందరూ భావించారు. అయితే, ఆ తర్వాత వరుస వైఫల్యాలు జట్టును దెబ్బతీశాయి. పదేపదే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం, ఫీల్డింగ్‌లో తప్పిదాలు, చివరి ఇన్నింగ్స్‌లో బౌలర్లు తేలిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి విజయాన్ని అందుకుంది.  

బ్యాటింగ్ వైఫల్యాలు
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో ఒక దశలో 430/3 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, ఆ తర్వాత కేవలం 41 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. 600 పరుగులు దాటుతుందని భావించిన స్కోరు 471 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే కథ పునరావృతమైంది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రాణించడంతో 333/5 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో మరోసారి కుప్పకూలిన భారత్, అదనంగా 77 పరుగులు మాత్రమే జోడించి 364 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్, చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది.

కీలక సమయాల్లో ఫీల్డింగ్ తప్పిదాలు
రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత ఫీల్డింగ్ పేలవంగా ఉంది. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు కీలక క్యాచ్‌లను జారవిడిచాడు. బెన్ డకెట్ 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జైస్వాల్ వదిలేయడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఆ తర్వాత డకెట్ 149 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రతీ క్యాచ్ డ్రాప్ తర్వాత భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపించింది. కేవలం జైస్వాల్ మాత్రమే కాకుండా, స్లిప్‌లోనూ క్యాచ్‌లు నేలపాలయ్యాయి. అవుట్‌ ఫీల్డర్లు బంతిని అంచనా వేయడంలో తడబడ్డారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా కీలక సమయాల్లో వికెట్ల వెనుక తేలిపోయాడు. ఐదో రోజు పిచ్‌పై ప్రతీ పరుగూ కీలకమైన తరుణంలో ఇటువంటి తప్పిదాలు ఇంగ్లాండ్ కు అనేక లైఫ్‌లైన్‌లు ఇచ్చాయి.

ప్రభావం చూపని బౌలింగ్ కూర్పు 
బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, జడేజాలతో కూడిన భారత బౌలింగ్ యూనిట్ కీలక సమయంలో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో విఫలమైంది. బౌలింగ్ కూర్పులో సమతుల్యత లోపించింది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సిరాజ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అర్ష్‌దీప్ సింగ్ వంటి అదనపు పేస్ బౌలర్ లేదా దూకుడైన రిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోకపోవడం బౌలింగ్ విభాగాన్ని బలహీనపరిచింది. బ్యాటింగ్‌లో ఉపయోగపడతాడనే ఉద్దేశంతో జట్టులోకి తీసుకున్న శార్దూల్ రెండో ఇన్నింగ్స్‌లో కొన్ని పరుగులు చేసినప్పటికీ, బౌలింగ్‌లో తేలిపోయాడు. దీంతో అతని ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. జడేజా, స్టోక్స్‌ వికెట్‌ పడగొట్టినప్పటికీ, ప్రత్యర్థి బ్యాటర్లను నిలకడగా కట్టడి చేయడంలో గానీ, భయపెట్టడంలో గానీ విఫలమయ్యాడు.

జస్ప్రీత్ బుమ్రాపై అతిగా ఆధారపడటం 
జస్ప్రీత్ బుమ్రా ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తాడనే నమ్మకం ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రివర్స్ స్వింగ్, వేగం, కచ్చితత్వంతో కూడిన అతని బౌలింగ్ ప్రత్యర్థిని వణికించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు వికెట్లు అత్యవసరమైనప్పుడు తేలిపోయాడు. అతడి బౌలింగ్‌ను డకెట్, జాక్ క్రాలీ సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో బుమ్రా రాణిస్తే భారత్ పోటీలో ఉంటుంది, లేకపోతే త్వరగా చేతులెత్తేస్తోందన్న వాదనకు మరోమారు బలం చేకూరింది.

ఇంగ్లాండ్‌ మెరుగైన, తెలివైన ఆటతీరు
భారత్‌కు కొన్ని అవకాశాలు లభించినప్పటికీ ఇంగ్లాండ్‌ ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు. వారి ఆటతీరు ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా, నిర్భయంగా సాగింది. వారు తొందరపడలేదు, అలాగని అతిజాగ్రత్తకూ పోలేదు. డకెట్ 149 పరుగులు, తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన క్రాలీ రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో రాణించడం ఇంగ్లాండ్‌ విజయానికి పునాది వేశాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ సెంచరీ, హ్యారీ బ్రూక్ సెంచరీకి చేరువ కావడంతో భారత్ 471 పరుగులకు సమానంగా 465 పరుగులు చేసింది. ఐదో రోజు 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ ఉదయం సెషన్‌లో అద్భుతమైన క్రమశిక్షణతో బ్యాటింగ్ చేసి, ఒత్తిడిని అధిగమించింది. ఆ తర్వాత అవసరమైనప్పుడు వేగం పెంచింది. ఎప్పుడు దాడి చేయాలో, ఎప్పుడు నిలకడగా ఆడాలో వారి ప్రణాళిక భారత బౌలర్లను అధిగమించింది.

శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత యువ జట్టు, ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లో ఆశాజనకంగా కనిపించినప్పటికీ, తక్షణమే దృష్టి సారించాల్సిన కొన్ని బలహీనతలు ఈ మ్యాచ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. మిడిలార్డర్ సమస్యలను పరిష్కరించడం, ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచడం, లేదా ఒకే బౌలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఈ ఓటమి భవిష్యత్తు ప్రణాళికలకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. 
Shubman Gill
India vs England
India test match
Headingley Test
Indian cricket team
Jasprit Bumrah
Yashasvi Jaiswal
Cricket
Test series
Indian batting failure

More Telugu News